అరబిందో రియల్టీ చేతికి జీఎంఆర్ కేఎస్‌ఈజెడ్

25 Sep, 2020 12:32 IST|Sakshi

కాకినాడ్‌ సెజ్‌లో 51 శాతం వాటా విక్రయం

ఒప్పందం విలువ రూ. 2,610 కోట్లు

అరబిందో రియల్టీ- జీఎంఆర్‌ మధ్య డీల్‌

10 శాతం దూసుకెళ్లిన జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా షేరు 

ఆంధ్రప్రదేశ్‌, తూర్పుగోదావరిలో గల కాకినాడ సెజ్‌ లిమిటెడ్‌(కేఎస్‌ఈజెడ్‌)ను అరబిందో రియల్టీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు విక్రయిస్తున్నట్లు మౌలిక రంగ హైదరాబాద్‌ కంపెనీ జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ తాజాగా వెల్లడించింది. అనుబంధ సంస్థ జీఎంఆర్‌ సెజ్‌ అండ్‌ పోర్ట్‌ హోల్డింగ్‌ ద్వారా కేఎస్‌ఈజెడ్‌లో తమకుగల 51 శాతం వాటాను విక్రయించేందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. డీల్‌ విలువ రూ. 2,610 కోట్లుకాగా.. తొలి దశలో రూ.  1,600 కోట్లను అందుకోనున్నట్లు తెలియజేసింది. తదుపరి రెండు, మూడేళ్లలో రూ. 1,010 కోట్లు లభించనున్నట్లు వివరించింది. డీల్‌లో భాగంగా కేఎస్‌ఈజెడ్‌లో వాటాతోపాటు.. కాకినాడ గేట్‌వే పోర్ట్‌ లిమిటెడ్‌లో కేఎస్‌ఈజెడ్‌కు గల 100 శాతం వాటాను సైతం అరబిందో రియల్టీకి బదిలీ చేయనున్నట్లు వివరించింది. 

షేరు జూమ్
కేఎస్‌ఈజెడ్‌ విక్రయానికి అరబిందో రియల్టీతో డీల్‌ కుదుర్చుకున్నట్లు వెల్లడించిన నేపథ్యంలో జీఎంఆర్‌ ఇన్‌ఫ్రా కౌంటర్‌కు డిమాండ్‌ పుట్టింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం ఈ షేరు 10 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 23.25 వద్ద ఫ్రీజయ్యింది. పోర్ట్‌ ఆధారిత మల్టీ ప్రొడక్ట్‌ ప్రత్యేక ఆర్థిక మండలిగా కేఎస్‌ఈజెడ్‌ కార్యకలాపాలు సాగిస్తోంది. 

మరిన్ని వార్తలు