అరబిందో చేతికి కాకినాడ సెజ్‌

26 Sep, 2020 03:55 IST|Sakshi

51 శాతం వాటా అరబిందో రియల్టీకి విక్రయించిన జీఎంఆర్‌ గ్రూపు

ఈ వాటా విలువ రూ. 2,610 కోట్లుగా ప్రకటించిన జీఎంఆర్‌

ఎన్‌ఎస్‌ఈలో 11 శాతం పెరిగిన జీఎంఆర్‌ షేరు ధర

సాక్షి, అమరావతి: జీఎంఆర్‌ కాకినాడ సెజ్‌లో మెజార్టీ వాటాను అరబిందో గ్రూపు కొనుగోలు చేసింది. కాకినాడ సెజ్‌ (కేసెజ్‌) లిమిటెడ్‌లోని 51 శాతం వాటాను అరబిందో గ్రూపునకు చెందిన అరబిందో రియల్టీకి విక్రయిస్తున్నట్లు జీఎంఆర్‌ గ్రూపు శుక్రవారం ప్రకటించింది. కేసెజ్‌ అనుబంధ కంపెనీ కాకినాడ గేట్‌వే పోర్ట్‌ లిమిటెడ్‌కు చెందిన 100 శాతం వాటాను అరబిందో రియల్టీకి బదలాయిస్తున్నట్లు పేర్కొంది.  ఈ మేరకు ఇరు సంస్థల మధ్య ఒప్పందం కుదిరినట్లు పేర్కొంది.

ఈ 51 శాతం వాటాను అప్పులతో కలిపి రూ.2,610 కోట్లకు విక్రయిస్తున్నామని, ఇందులో మొదటి విడతగా రూ.1,600 కోట్లు చెల్లించే విధంగాను మిగిలిన మొత్తం రూ.1,010 కోట్లు రెండు మూడేళ్లలో చెల్లించే విధంగా ఒప్పం కుదుర్చుకుంది. ఇంకా ఈ విక్రయానికి రెగ్యులేటరీ సంస్థల అనుమతులు లభించాల్సి ఉంది. అప్పుల భారం తగ్గించుకోవడంలో భాగంగా వాటా విక్రయించినట్లు జీఎంఆర్‌ గ్రూపు పేర్కొంది.  మార్చి 2020 నాటికి జీఎంఆర్‌ గ్రూపునకు మొత్తం నికర అప్పులు రూ.26,300 కోట్లుగా ఉన్నాయి. 

సుమారు 10,400 ఎకరాల్లో జీఎంఆర్‌ మల్టీ ప్రోడక్ట్‌ సెజ్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇందులో 5,000 ఎకరాలు పోర్టు ఆథారిత సెజ్‌గా అనుమతులు తీసుకుంది. దీనికి తోడు కోన గ్రామం వద్ద వాణిజ్య అవసరాల కోసం ఓడ రేవును కూడా నిర్మిస్తోంది. ఫార్మా దిగ్గజం అరబిందో ఫార్మా 2019లో అరబిందో రియల్టీ పేరుతో రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి అడుగు పెట్టింది. ఇప్పటికే హైదరాబాద్‌లో పలు వాణిజ్య, నివాస సముదాయాలు నిర్మిస్తున్న అరబిందో రియల్టీ సంస్థ ఇప్పుడు కేసెజ్‌లో మెజార్టీ వాటాను దక్కించుకుంది. ఈ వార్తల నేపథ్యంలో శుక్రవారం ఎన్‌ఎస్‌ఈలో జీఎంఆర్‌ గ్రూపు షేరు క్రితం ముగింపు ధరతో పోలిస్తే 14.18 శాతం పెరిగి రూ.24.15 చేరుకొని చివరకు 11.11 శాతం వృద్ధితో రూ.23.50 వద్ద ముగిసింది.  

మరిన్ని వార్తలు