ఫ్యామిలీ వెకేషన్స్‌.. టాప్‌ 5 డెస్టినేషన్స్‌ ఇవే

20 Jun, 2022 06:16 IST|Sakshi

కుటుంబ సమేతంగా పర్యటనకు ఎంపికలు ఇవే..

గోవా, నైనిటాల్, రిషికేశ్, మౌంట్‌ అబూ

ఆతిథ్య సంస్థ ఓయో సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: కుటుంబ సభ్యులంతా కలసి వేసవి సెలవుల్లో గడిపేందుకు వెళ్లాలనుకుంటున్న ప్రాంతాల్లో గోవా, నైనిటాల్, రిషికేశ్, గ్యాంగ్‌టక్, మౌంట్‌అబూ టాప్‌–5గా ఉన్నట్టు ఓయో నిర్వహించిన సర్వేలో తెలిసింది. ‘సమ్మర్‌ వెకేషన్‌ ఇండెక్స్‌ – ఫ్యామిలీ ఎడిషన్‌ 2022’పేరుతో తన సర్వే వివరాలను ఒక నివేదిక రూపంలో ఓయో విడుదల చేసింది. వేసవి సెలవుల్లో పిల్లలను ఆడించడం, వారినే అట్టిపెట్టుకోవడం కష్టమైన టాస్క్‌గా తల్లిదండ్రులు చెప్పారు.

దీనికి బదులు కొన్ని రోజుల పాటు కుటుంబమంతా కలసి విహారయాత్రకు వెళ్లి రావాలనుకుంటున్నట్టు తెలిపారు. ‘‘65 శాతం తల్లిదండ్రులు తమ పిల్లలతో కలసి వేసవి సెలవులకు ట్రిప్‌ ప్లాన్‌ చేద్దామని అనుకుంటున్నట్టు చెప్పారు. వరుసగా రెండేళ్లపాటు వేసవిలో లౌక్‌డౌన్‌లు ఉండడం కూడా ఈ ధోరణి పెరగడానికి కారణం’’అని ఓయో పేర్కొంది. జూన్‌ మొదటి రెండు వారాల్లో ఓయో ఈ సర్వే నిర్వహించింది. 1,072 మంది అభిప్రాయాలను సమీకరించింది.  

పిల్లలకు సదుపాయాలు
ఇందులో 41 శాతం మంది తమ ఎంపిక గోవా అని చెప్పారు. పిల్లలు, కుటుంబ సభ్యులతో కలసి చూడతగ్గ ప్రదేశంగా దీన్ని భావిస్తున్నారు. ఆ తర్వా త నైనిటాల్, రిషికేశ్, గ్యాంగ్‌టక్, మౌంట్‌అబూ, పుదుచ్చేరి, మెక్‌లయోడ్‌ గంజ్, మహాబలేశ్వర్‌ ఎంపికలుగా ఉన్నాయి. ఈ ఎంపికలను పరిశీలిస్తే తల్లిదండ్రులు ప్రకృతి సహజత్వం ఎక్కువగా ఉన్న పర్వత ప్రాంతాలు, బీచ్‌లకు ప్రాధాన్యం ఇస్తున్న ట్టు ఓయో సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీరంగ్‌ గాడ్‌ బోల్‌ పేర్కొన్నారు.

హోటళ్లలో ఎంపికలను గమనిస్తే.. 56 శాతం మంది స్విమ్మింగ్‌ పూల్‌ ఉన్న హోటళ్లకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. పిల్లల కోసం వారు స్విమ్మింగ్‌ పూల్, ఆటలాడుకునే ప్లే ఏరియా ను హోటళ్లలో కోరుకుంటున్నారు. ఆ తర్వాత వాటర్‌ పార్క్‌లు, పెద్ద టెలివిజన్‌ ఇతర సదుపాయాలు ఉంటే బావుంటుందని చెప్పారు. సర్వేలో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది 1–3 రోజుల పాటు ట్రిప్‌కు వెళ్లొచ్చే ఆలోచనతో ఉన్నట్టు చెబితే.. 38 శాతం మంది ఒక వారం రోజులైనా జాలీగా గడిపి రావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

మరిన్ని వార్తలు