గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌ భళా- హెచ్‌ఏఎల్‌ బోర్లా

27 Aug, 2020 14:16 IST|Sakshi

వ్యాపార విస్తరణ ప్రణాళికలు 

14 శాతం దూసుకెళ్లిన గాడ్‌ఫ్రే ఫిలిల్స్‌

ప్రభుత్వ డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రణాళికలు

14 శాతం కుప్పకూలిన హెచ్‌ఏఎల్‌ షేరు

సానుకూల ప్రపంచ సంకేతాలతో వరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో వివిధ విభాగాలలో కార్యకలాపాల విస్తరణ ప్రణాళికలు ప్రకటించిన టొబాకొ ప్రొడక్టుల దిగ్గజం గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌ ఇండియా లిమిటెడ్‌ కౌంటర్‌ ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటోంది. కాగా.. మరోపక్క కేంద్ర ప్రభుత్వ వాటా విక్రయానికి తాజాగా ఫ్లోర్‌ ధరను ప్రకటించడంతో పీఎస్‌యూ దిగ్గజం హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌(హెచ్‌ఏఎల్‌) కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. వెరసి గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌ ఇండియా లాభాలతో సందడి చేస్తుంటే.. హెచ్‌ఏఎల్‌ నష్టాలతో కళ తప్పింది. ఇతర వివరాలు చూద్దాం..

గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌ ఇండియా
దేశీయంగా మాల్‌బోరో బ్రాండ్‌ సిగరెట్ల తయారీ, విక్రయాలకు ఫిలిప్‌ మోరిస్‌ ఇంటర్నేషనల్‌తో భాగస్వామ్యాన్ని పటిష్ట పరచుకోనున్నట్లు గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌ ఇండియా తాజాగా పేర్కొంది. అంతేకాకుండా ప్రస్తుతం ఎగుమతి చేస్తున్న మార్కెట్లలో సొంత బ్రాండ్లను పెంచుకునేందుకు చూస్తున్నట్లు తెలియజేసింది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా మరిన్ని ప్రొడక్టులను ప్రవేశపెట్టనున్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో గాడ్‌ఫ్రే ఫిలిప్స్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 8 శాతం జంప్‌చేసి రూ. 1033 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 14 శాతం దూసుకెళ్లి రూ. 1092ను అధిగమించింది.

హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌
ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) ద్వారా కంపెనీలో 10 శాతం వాటాను ప్రమోటర్‌ కేంద్ర ప్రభుత్వం విక్రయించనుంది. అధిక స్పందన లభిస్తే అదనంగా 5 శాతం వాటాను సైతం అమ్మివేయనుంది. ఇందుకు ఫ్లోర్‌ ధర రూ. 1,001కాగా.. ఇది బుధవారం ముగింపు ధర రూ. 1178తో పోలిస్తే 15 శాతం తక్కువ. కంపెనీలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి 89.97 శాతం వాటా ఉంది. వాటా విక్రయం ద్వారా రూ. 5020 కోట్లవరకూ సమీకరించనుంది. ఫ్లోర్‌ ధరలో రిటైల్‌ ఇన్వెస్టర్లకు రూ. 5 డిస్కౌంట్‌ లభించనుంది. ఈ నేపథ్యంలో హెచ్‌ఏఎల్‌ షేరు ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 14 శాతం పడిపోయి రూ. 1014 వద్ద ట్రేడవుతోంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు