చిన్న సంస్థలకు గోద్రెజ్‌ క్యాపిటల్‌ రుణాలు

13 Oct, 2022 06:29 IST|Sakshi
కంపెనీ ఎండీ మనీష్‌ షా

హైదరాబాద్‌లోనూ కార్యకలాపాలు ప్రారంభం

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: గోద్రెజ్‌ గ్రూప్‌ సంస్థ గోద్రెజ్‌ క్యాపిటల్‌ .. చిన్న, మధ్య తరహా (ఎస్‌ఎంఈ) సంస్థలకు ప్రాపర్టీ తనఖా రుణాలపై (ఎల్‌ఏపీ) మరింతగా దృష్టి పెడుతోంది. తాజాగా హైదరాబాద్‌లోనూ కార్యకలాపాలు ప్రారంభించింది. హైదరాబాద్‌ ప్రాంతంలో ఎల్‌ఏపీ మార్కెట్‌ విలువ దాదాపు రూ. 700 కోట్లుగా ఉంటుందని ఈ సందర్భంగా కంపెనీ ఎండీ మనీష్‌ షా వెల్లడించారు. వచ్చే 18 నెలల్లో ఇందులో కనీసం 10 శాతం వాటా దక్కించుకోవాలని భావిస్తున్నట్లు వివరించారు.

త్వరలో ఎస్‌ఎంఈలకు అన్‌సెక్యూర్డ్‌ రుణాల విభాగంలోకి కూడా అడుగుపెట్టనున్నట్లు ఆయన చెప్పారు. ఎస్‌ఎంఈల వ్యాపార నిర్వహణ అవసరాలు విభిన్నంగా ఉంటాయని, అందుకు అనుగుణంగా అవి తమ వెసులుబాటును బట్టి మరీ భారం పడకుండా ఈఎంఐలను ఎంచుకునే విధానం, పాతికేళ్ల వరకూ కాలపరిమితి మొదలైన ఆప్షన్లు అందిస్తున్నట్లు మనీష్‌ షా తెలిపారు. 2020 నవంబర్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన తమ సంస్థ ప్రస్తుతం హైదరాబాద్‌ సహా 11 నగరాలకు విస్తరించిందని చెప్పారు.

వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పటికీ రుణాలకు డిమాండ్‌పై ప్రతికూల ప్రభావమేదీ పెద్దగా కనిపించడం లేదని షా తెలిపారు. హౌసింగ్‌ ఫైనాన్స్‌ వ్యాపార విభాగం ద్వారా గృహ రుణాలు, గోద్రెజ్‌ ఫైనాన్స్‌ విభాగం ద్వారా ఎల్‌ఏపీ రుణాలు అందిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎల్‌ఏపీ కార్యకలాపాలు మాత్రమే ప్రారంభించినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ రూ. 3,500 కోట్ల పైచిలుకు రుణాలు మంజూరు చేశామని ఇందులో రూ. 2,500 కోట్ల మేర గృహ రుణాలు, మిగతావి ఎల్‌ఏపీ ఉన్నాయని షా వివరించారు. రుణ మొత్తాన్ని 2024 మార్చి నాటికి రూ. 12,000 కోట్లకు, 2026 కల్లా రూ. 30,000 కోట్లకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు పేర్కొన్నారు.   
 

మరిన్ని వార్తలు