బంగారం కొండ దిగుతోంది..!

13 Aug, 2020 04:25 IST|Sakshi

3 రోజుల్లో రూ. 4,000 పైగా డౌన్‌

న్యూఢిల్లీ: నిన్నమొన్నటిదాకా సరికొత్త శిఖరాలతో వెలుగులు విరజిమ్మిన బంగారం... ఇప్పుడు కొండ దిగుతోంది!! ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌కు తొలిసారి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చిందన్న వార్తలతో పుత్తడి ఒక్కసారిగా నేలచూపులు చూస్తోంది. అంతర్జాతీయ ధోరణికి అనుగుణంగా దేశంలో పసిడి ధర పతనం అవుతోంది. దేశీయ స్పాట్‌ ప్రధాన మార్కెట్‌– న్యూఢిల్లీలో  శుక్రవారం (ఆగస్టు 7వ తేదీ) 10 గ్రాములు స్వచ్చత ధర రికార్డు స్థాయిలో రూ.57,008 చూస్తే, బుధవారం నాటికి రూ.52,946కు దిగివచ్చింది.

అంటే కేవలం మూడు రోజుల్లో రూ.4,062 తగ్గిందన్నమాట. మూడు రోజులుగా పసిడి ప్రతిరోజూ ఇక్కడ రూ.1,200కుపైగా తగ్గుతూ వచ్చింది. ఇక వెండి ధర కూడా భారీగా పతనం అవుతుండడం గమనార్హం. 7వ తేదీన ఇక్కడి స్పాట్‌ మార్కెట్‌లో రికార్డు స్థాయిలో రూ.77,840కి చేరిన కేజీ వెండి ధర బుధవారానికి రూ.67,584కు చేరింది. మూడు రోజుల్లో వెండి రూ.10,256కు తగ్గింది. దేశ వ్యాప్తంగా పలు పట్టణాల స్పాట్‌ మార్కెట్లలో కూడా పసిడి, వెండి ధరలు భారీగా దిగివస్తున్నాయి. 7వ తేదీ వరకూ వరుసగా 16 రోజులు ఏరోజుకారోజు దేశీయంగా పసిడి ధరలు పెరుగుతూ వచ్చిన విషయం గమనార్హం.

ఇక ఈ వార్త రాసే సమయానికి (రాత్రి 9.30 గంటలు) దేశీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌ మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌ (ఎంసీఎక్స్‌)లో పసిడి 10 గ్రాముల ధర రూ.52,292 వద్ద ట్రేడవుతోంది. ఇక్కడ శుక్రవారం రికార్డు స్థాయిలో ధర రూ.55,850 చేరిన సంగతి తెలిసిందే. దేశీయంగా ఈక్విటీ మార్కెట్‌ పెరుగుదల ధోరణి నేపథ్యంలో డాలర్‌ మారకంలో రూపాయి విలువ (ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో) దాదాపు స్థిరంగా ఉంది. బుధవారం ధర 74.83 వద్ద ఉంది. రూపాయికి ఇప్పటివరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్‌ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్‌ 16వ తేదీ).

పరుగుకు రష్యా ‘వ్యాక్సిన్‌’ బ్రేకులు
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వైరస్‌ విజృంభణ, కోవిడ్‌ మరణాల సంఖ్య భారీగా పెరుగుతుండడం, ఆర్థిక అనిశ్చితి,  అమెరికా–చైనా మధ్య ఉద్రిక్తత, వివిధ దేశాల కరెన్సీ విలువల పతనం వంటి అంశాల నేపథ్యంలో బంగారం అంతర్జాతీయంగా భారీగా పెట్టుబడులను ఆకర్షించింది. అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌– న్యూయార్క్‌ మర్కంటైల్‌ ఎక్సే్చంజ్‌ (నైమెక్స్‌)లో పసిడి ఔన్స్‌ (31.1గ్రా) గత శుక్రవారం (7వ తేదీ) ఒక దశలో చరిత్రాత్మక రికార్డుస్థాయి 2,078 డాలర్లకు చేరింది. తొమ్మిదేళ్ల గరిష్ట స్థాయి 1,911.60 డాలర్లను బ్రేక్‌ చేసిన జూలై 27 తర్వాత కేవలం 10 రోజుల్లోనే పసిడి ఈ స్థాయికి చేరడం గమనార్హం.  అయితే ఈ స్థాయి వద్ద భారీ లాభాల స్వీకరణకు ఇన్వెస్టర్లు దిగారు.

దీనితో శుక్రవారం (7వ తేదీ) ట్రేడింగ్‌ చివర గంటల నుంచీ పసిడి పెట్టుబడుల ఉపసంహరణ ప్రారంభమైంది. దీనికితోడు కరోనా వ్యాక్సిన్‌ విడుదల చేసినట్లు స్వయంగా దేశాధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించడం పసిడి ధరకు మరింత ప్రతికూలం అయ్యాయి. బుధవారం ఈ వార్త రాసే 9.30 గంటల సమయానికి చరిత్రాత్మక గరిష్ట స్థాయిల నుంచి (2,078 డాలర్ల) చూస్తే, ధర 128 డాలర్లు పతనమై, 1,957 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో 202 డాలర్లు పడిపోయి ఏకంగా 1,876 డాలర్లు చూడ్డం గమనార్హం. అయితే ఈ స్థాయిని చూసిన కేవలం కొద్ది  గంటల్లోనే ధర కీలక నిరోధ స్థాయి (1,911 డాలర్లు)ని మళ్లీ దాటి,  మంగళవారం ముగింపుకన్నా 12 డాలర్ల లాభంతో 1,957 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

మరిన్ని వార్తలు