ట్రంప్‌ ఎఫెక్ట్‌- పసిడి, వెండి.. మెరుపులు

10 Oct, 2020 09:34 IST|Sakshi

రూ. 50,817 వద్ద ముగిసిన 10 గ్రాముల పసిడి

ఎంసీఎక్స్‌లో రూ. 62,884 వద్ద నిలిచిన కేజీ వెండి

న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌ పసిడి 1,926 డాలర్లకు

25.11 డాలర్ల వద్ద స్థిరపడిన ఔన్స్‌ వెండి

డెమొక్రాట్లు, రిపబ్లికన్లు ప్రతిపాదిస్తున్న ప్యాకేజీకంటే మరింత అధికంగా స్టిములస్‌ చర్యలకు సిద్ధమంటూ అమెరికన్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొనడంతో వారాంతాన బులియన్‌ మార్కెట్లకు జోష్‌ వచ్చింది. అధ్యక్ష ఎన్నికలయ్యే వరకూ డెమొక్రాట్లతో సహాయక ప్యాకేజీలపై చర్చలు నిర్వహించేదిలేదంటూ వారం మొదట్లో ట్రంప్‌ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ట్రంప్‌ వ్యాఖ్యలతో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు బలహీనపడగా.. తాజా పెట్టుబడులపై అంచనాలతో పసిడి, వెండి దూసుకెళ్లాయి. ఫలితంగా న్యూయార్క్‌ కామెక్స్‌లోనూ, దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ ధరలు జంప్‌చేశాయి. పసిడి 1912 డాలర్లను అధిగమించడంతో తదుపరి 1939 డాలర్ల వద్ద రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని బులియన్‌ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

బలపడ్డాయ్‌
ఎంసీఎక్స్‌లో శుక్రవారం 10 గ్రాముల పసిడి రూ. 642 లాభపడి రూ. 50,817 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. ఇంట్రాడేలో బంగారం రూ. 50,970 వద్ద గరిష్టాన్ని తాకగా.. రూ. 50,300 వద్ద కనిష్టానికి చేరింది. ఇదే విధంగా వెండి కేజీ డిసెంబర్‌ ఫ్యూచర్స్‌  రూ. 2,365 జంప్‌చేసి రూ. 62,884 వద్ద స్థిరపడింది. తొలుత రూ. 63,242 వరకూ పెరిగిన వెండి ఒక దశలో రూ. 61,038 వరకూ నీరసించింది. 

లాభాలలో
న్యూయార్క్‌ కామెక్స్‌లో బంగారం, వెండి ధరలు లాభాలతో ముగిశాయి. ఫ్యూచర్స్‌లో ఔన్స్‌(31.1 గ్రాములు) పసిడి 1.65 శాతం పుంజుకుని 1,926 డాలర్ల ఎగువకు చేరగా.. స్పాట్‌ మార్కెట్లోనూ 2 శాతం బలపడి 1,930 డాలర్ల వద్ద నిలిచింది. ఇక వెండి ఔన్స్‌ 5.2 శాతం జంప్‌చేసి 25.11 డాలర్ల వద్ద స్థిరపడింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా