ప్యాకేజీ ఆశలు- రూ. 51,000కు పసిడి

21 Oct, 2020 10:35 IST|Sakshi

ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 51,012కు

ఎంసీఎక్స్‌లో కేజీ వెండి రూ. 63,575 వద్ద ట్రేడింగ్‌

న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌ పసిడి 1924 డాలర్లకు

25.25 డాలర్ల వద్ద కదులుతున్న ఔన్స్‌ వెండి

దేశీ మార్కెట్లో వరుసగా రెండు రోజులు లాభపడిన బంగారం, వెండి ధరలు మరోసారి బలపడ్డాయి. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం  రూ. 102 పెరిగి రూ. 51,012 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ రూ. 451 లాభపడి రూ. 63,575 వద్ద కదులుతోంది. 

ప్యాకేజీకి రెడీ..
కోవిడ్‌-19ను ధీటుగా ఎదుర్కొనేందుకు వీలుగా ప్రతిపాదించిన 2.2 లక్షల కోట్ల డాలర్ల ప్యాకేజీపై ఆర్థిక మంత్రి స్టీవ్‌ ముచిన్‌తో నిర్వహిస్తున్న చర్చలను బుధవారం సైతం కొనసాగించనున్నట్లు హౌస్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తాజాగా పేర్కొన్నారు. తద్వారా వారాంతంలోగా ప్యాకేజీకి గ్రీన్‌సిగ్నల్‌ లభించే వీలున్నట్లు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. దీనికితోడు సహచర రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నప్పటికీ.. భారీ ప్యాకేజీకి సిద్ధమంటూ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ తాజాగా పేర్కొనడంతో సెంటిమెంటు బలపడినట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీంతో రెండు రోజులుగా పసిడి, వెండి ధరలకు జోష్‌వచ్చినట్లు బులియన్‌ నిపుణులు తెలియజేశారు. ప్యాకేజీ కారణంగా లభించే చౌక నిధులు రక్షణాత్మక పెట్టుబడిగా భావించే పసిడి తదితర విలువైన లోహాల కొనుగోలుకి మళ్లవచ్చన్న అంచనాలు దీనికి కారణమని తెలియజేశారు.

మంగళవారమిలా
వరుసగా రెండో రోజు మంగళవారం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి రూ. 226 బలపడి రూ. 50,913 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 50,940 వద్ద గరిష్టాన్ని తాకగా.. 50,491 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. వెండి కేజీ రూ. 970 ఎగసి రూ. 63,065 వద్ద నిలిచింది. ఒక దశలో 63,259 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 61,662 వరకూ క్షీణించింది. 

కామెక్స్‌లో..
న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌(31.1 గ్రాములు) పసిడి ప్రస్తుతం 0.5 శాతం లాభపడి 1,924 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్‌ మార్కెట్లోనూ 0.6 శాతం ఎగసి 1,919 డాలర్ల వద్ద కదులుతోంది. వెండి సైతం 1 శాతం పురోగమించి ఔన్స్ 25.25 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. 

మరిన్ని వార్తలు