బంగారం- వెండి.. రికవరీ బాట

14 Sep, 2020 10:12 IST|Sakshi

ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 51,470కు

ఎంసీఎక్స్‌లో కేజీ వెండి రూ. 68,225 వద్ద ట్రేడింగ్‌

న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌ పసిడి 1957 డాలర్లకు

27.08 డాలర్ల వద్ద కదులుతున్న ఔన్స్‌ వెండి

వారాంతాన క్షీణ పథం పట్టిన పుత్తడి, వెండి ధరలు కోలుకున్నాయి. అటు విదేశీ మార్కెట్లో అంటే న్యూయార్క్‌ కామెక్స్‌లో 0.5 శాతం పుంజుకోగా.. ఇటు దేశీయంగా డెరివేటివ్‌ విభాగంలోనూ స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి. వెరసి ప్రస్తుతం సానుకూల ధోరణిలో కదులుతున్నాయి. వివరాలు చూద్దాం..  

లాభాల్లో..
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 151 బలపడి రూ. 51,470 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ రూ. 297 పుంజుకుని రూ. 68,225 వద్ద కదులుతోంది.

ర్యాలీకి బ్రేక్‌
ఎంసీఎక్స్‌లో గత వారం తొలి నాలుగు రోజులపాటు ర్యాలీ బాటలో సాగిన పుత్తడి, వెండి ధరలకు వారాంతాన బ్రేక్‌ పడింది. శుక్రవారం 10 గ్రాముల బంగారం రూ. 455 క్షీణించి రూ. 51,319 వద్ద ముగిసింది. తొలుత 51,684 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 51,224 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. ఇక వెండి కేజీ రూ. 1,063 పతనమై రూ. 67,928 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 68,579 వరకూ ఎగసిన వెండి ఒక దశలో రూ. 67,613 వరకూ నష్టపోయింది. అంతక్రితం వారంలో నమోదైన నాలుగు రోజుల వరుస నష్టాలకు సోమవారం(7) నుంచీ చెక్‌ పడిన విషయం విదితమే.

కామెక్స్‌లో  అప్‌
న్యూయార్క్‌ కామెక్స్‌లో  బంగారం, వెండి ధరలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఔన్స్‌(31.1 గ్రాములు) పసిడి 0.5 శాతం పుంజుకుని 1,957 డాలర్లకు చేరింది. స్పాట్‌ మార్కెట్లోనూ 0.4 శాతం బలపడి 1948 డాలర్ల ఎగువన కదులుతోంది. వెండి మరింత అధికంగా ఔన్స్ 0.7 శాతం ఎగసి 27.08 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

మరిన్ని వార్తలు