రెండో రోజూ పసిడి.. వెండి నేలచూపు 

7 Oct, 2020 10:12 IST|Sakshi

ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 50,056కు

ఎంసీఎక్స్‌లో రూ. 59,630 వద్ద ట్రేడవుతున్న కేజీ వెండి

న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌ పసిడి 1,887 డాలర్లకు

23.55 డాలర్ల వద్ద కదులుతున్న ఔన్స్‌ వెండి

కోవిడ్‌-19 ధాటికి ఆర్థిక వ్యవస్థ డీలా పడినట్లు అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ తాజాగా పేర్కొంది. రికవరీకి దన్నుగా సహాయక ప్యాకేజీని అమలు చేయవలసి ఉన్నట్లు ఫెడ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్ స్పష్టం చేశారు. అయితే డెమొక్రాట్లతో విభేధాల కారణంగా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ అధ్యక్ష ఎన్నికలయ్యేవరకూ స్టిములస్‌ చర్చలు నిలిపివేయవలసిందిగా ప్రభుత్వ ప్రతినిధులను ఆదేశించారు. దీంతో పసిడి, వెండి ఫ్యూచర్స్‌లో ట్రేడర్లు  అమ్మకాలకు తెరతీసినట్లు నిపుణులు పేర్కొన్నారు. వెరసి దేశ, విదేశీ మార్కెట్లలో వరుసగా రెండో రోజు పసిడి, వెండి ధరలు వెనకడుగు వేస్తున్నాయి. అటు న్యూయార్క్‌ కామెక్స్‌లోనూ, ఇటు దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ నష్టాలతో ట్రేడవుతున్నాయి. వివరాలు చూద్దాం..

డీలా..
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 470 క్షీణించి రూ. 50,056 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్‌ ఫ్యూచర్స్‌  రూ. 941 నష్టపోయి రూ. 59,630 వద్ద కదులుతోంది. 

వెండి బోర్లా
బంగారం, వెండి ధరలు మంగళవారం డీలాపడ్డాయి. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి రూ. 100 తగ్గి రూ. 50,526 వద్ద ముగిసింది. తొలుత 50,982 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 50,445 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. వెండి కేజీ రూ. 1,370 నష్టపోయి రూ. 60,571 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో రూ. 62,365 వరకూ పుంజుకున్న వెండి ఒక దశలో రూ. 60,204 వరకూ నీరసించింది.

నష్టాలలో
న్యూయార్క్‌ కామెక్స్‌లో మంగళవారం స్వల్పంగా క్షీణించిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం మరోసారి వెనకడుగు వేస్తున్నాయి. ఫ్యూచర్స్‌లో ఔన్స్‌(31.1 గ్రాములు) పసిడి 1.2 శాతం(22 డాలర్లు) పతనమై 1,887 డాలర్లకు చేరగా.. స్పాట్‌ మార్కెట్లో మాత్రం 0.3 శాతం బలపడి 1,883 డాలర్ల వద్ద కదులుతోంది. ఇక వెండి ఔన్స్‌ 1.6 శాతం నష్టంతో 23.55 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

మరిన్ని వార్తలు