గోల్డ్‌ ఏటీఎంలూ వచ్చేస్తున్నాయ్‌

18 Mar, 2022 03:17 IST|Sakshi

సనత్‌నగర్‌:  నగదు విత్‌డ్రాయల్స్, జమకు ఉపయోగపడే ఏటీఎంల తరహాలోనే బంగారం కోసం కూడా ఏటీఎంలు దేశీయంగా అందుబాటులోకి రానున్నాయి. గోల్డ్‌ సిక్కా సంస్థ నెల, నెలన్నర వ్యవధిలో వీటిని ఏర్పాటు చేయనుంది. తొలుత హైదరాబాద్‌లో (చార్మినార్, సికింద్రాబాద్, అబిడ్స్‌) మూడు గోల్డ్‌ ఏటీఎంలను ప్రారంభించనున్నట్లు సంస్థ సీఈవో ఎస్‌వై తరుజ్‌ గురువారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. వీటి నుంచి ఒకేసారి 0.5 గ్రాముల నుంచి 500 గ్రాముల వరకూ బంగారాన్ని నాణేల రూపంలో కొనుగోలు చేయవచ్చన్నారు.

ఇందుకోసం డెబిట్, క్రెడిట్‌ కార్డులు లేదా తాము జారీ చేసే ప్రీపెయిడ్‌ కార్డులనూ ఉపయోగించవచ్చని చెప్పారు. బంగారం స్వచ్ఛతకు సంబంధించిన వివరాలన్నింటితో ప్యూరిటీ సర్టిఫికెట్‌ కూడా కొనుగోలు సమయంలోనే పొందవచ్చని తరుజ్‌ వివరించారు. ఒక్కో మిషన్‌లో ఒకేసారి రెండున్నర కోట్ల విలువైన 5 కేజీల పసిడిని లోడ్‌ చేయవచ్చని తరుజ్‌ వివరించారు. భారత్‌లో గోల్డ్‌ మార్కెట్‌ వేళలకు అనుగుణంగా ఉదయం 9.50 నుంచి రాత్రి 11.30 వరకు ఏటీఎంల ద్వారా గోల్డ్‌ తీసుకోవచ్చన్నారు. ప్రస్తు తం దుబాయ్, బ్రిటన్‌లలో మాత్రమే ఏటీఎంల ద్వారా 10 గ్రాములు, 20 గ్రాముల గోల్డ్‌ కాయిన్స్‌ ను కొనుగోలు చేసే సదుపాయం ఉందని చెప్పారు.  

మరిన్ని వార్తలు