బంగారం ధర మరింత దిగొస్తుందా? లేదా?

5 Apr, 2021 04:16 IST|Sakshi

పసిడిపై విశ్లేషకుల అంచనా

ధర తగ్గడంతో మార్చిలో భారీ దిగుమతులు  

ముంబై/న్యూయార్క్‌:  పసిడి ధరల కదలికలపై ప్రస్తుతం సర్వత్రా ఆసక్తి నెలకొంది. కరోనా వైరస్‌ తీవ్రంగా ఉన్న ఆగస్టు 2020లో పసిడి ధరలు 10 గ్రాముల పూర్తి స్వచ్ఛత ధరలు దేశంలోని ప్రధాన మార్కెట్‌ ముంబైలో రూ.56 వేల గరిష్ట స్థాయికి చేరాయి. ప్రస్తుతం దాదాపు రూ.45 వేల వద్ద ట్రేడవుతోంది. అంటే గరిష్టం నుంచి చూస్తే, దాదాపు 20 శాతం పడ్డాయి. ఆగస్టు 2020లో అంతర్జాతీయ ఫ్యూచర్స్‌ మార్కెట్‌ నైమెక్స్‌లో పసిడి ఔన్స్‌ (31.1 గ్రా) దాదాపు 2,072 డాలర్ల వద్ద ట్రేడయ్యింది.

2021 ఏప్రిల్‌ 1వ తేదీ గురువారంతో ముగిసిన వారంలో 1,730 డాలర్లకు చేరింది. గడచిన నెలరోజుల్లో పసిడికి 1,640 డాలర్ల వద్ద రెండుసార్లు పటిష్ట మద్దతు లభించింది. అలాగే 1,750 డాలర్ల వద్ద నిరోధం ఎదురయ్యింది. 1,750 డాలర్ల స్థాయిని అధిగమిస్తే,  తిరిగి పసిడి 1,850 డాలర్ల స్థాయికి ఎగసే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుత అంశాల ప్రాతిపదికన, ప్రపంచవ్యాప్తంగా పసిడి వినియోగంలో రెండవ అతిపెద్ద దేశమైన భారత్‌లో– 10 గ్రాములు పూర్తి స్వచ్ఛత ధర సమీప భవిష్యత్తులో రూ.40వేల కిందకి దిగిరాకపోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

విశ్లేషణలు ఇవీ...
అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు, వ్యాక్సినేషన్‌ విస్తృతి, సెకండ్‌ వేవ్‌ వంటి అంశాలపై పసిడి భవిష్యత్‌ ధర  ఆధారపడి ఉంటుందన్నది నిపుణుల అభిప్రాయం. అయితే పసిడి ఇప్పట్లో తిరిగి గరిష్టాల దిశగా వెళ్లే అవకాశం లేదన్నది నిపుణుల వాదన. అలాగే దేశీయంగా సమీప భవిష్యత్తులో పసిడి పూర్తి స్వచ్ఛత రూ.40,000 కిందకి పడకపోవచ్చనీ భావిస్తున్నారు. దేశంలో పసిడి ధర అంతర్జాతీయ ఆర్థిక అంశాలతోపాటు డాలర్‌ మారకంలో రూపాయి విలువపై ఆధారపడి ఉంటుంది. రూపాయి బలహీనపడితే పసిడి ధర పెరిగే వీలుంది. అయితే రూపాయి ప్రస్తుతం మరీ అంతగా బలహీనపడే అవకాశం లేదన్నది విశ్లేషణ.

ప్రస్తుతం డాలర్‌ మారకంలో రూపాయి విలువ  73కు 50 పైసలు అటు ఇటుగా కదలాడుతోంది.  విదేశీ సంస్థాగత పెట్టుబడుల ప్రవాహం,  ఈక్విటీ మార్కెట్ల బలోపేత ధోరణి రూపాయికి పటిష్టతను ఇస్తాయన్న అంచనాలు ఉన్నాయి. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్‌ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్‌ 16వ తేదీ). రూపాయి పటిష్టానికి తగిన చర్యలు తీసుకుంటామని ఆర్‌బీఐ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

గత ఆర్థిక సంవత్సరం ఆర్‌బీఐ తన ‘ఫారెక్స్‌ ఇంటర్‌వెన్షన్‌’ ద్వారా రూపాయి బలోపేతానికి దాదాపు 80 బిలియన్‌ డాలర్లు వెచ్చించినట్లు తెలుస్తోంది.  వెరసి ‘అంతర్జాతీయంగా ధర భారీగా పెరిగిపోతే తప్ప’ దేశంలో పసిడి ధర తగ్గడానికే అధిక అవకాశాలు ఉన్నాయని అంచనా.  అమెరికా సెంట్రల్‌ బ్యాంక్‌ ఫెడ్‌ ఫండ్స్‌ రేటు (ప్రస్తుతం 0.25 శాతం), అమెరికా డాలర్‌ కదలికల (ఏప్రిల్‌ 1వ తేదీతో ముగిసిన వారంలో డాలర్‌ ఇండెక్స్‌ ముగింపు 93), కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం, అమెరికా సహా ప్రపంచ ఎకానమీ రికవరీ ధోరణి వంటి కీలక అంశాలు అంతర్జాతీయంగా పసిడి ధరను ప్రభావితం చేసే అవకాశం ఉంది. పసిడి 52 వారాల కనిష్ట ధర 1,458 డాలర్లు కాగా, గరిష్ట ధర రూ.2,089 డాలర్లు. ఇక డాలర్‌ ఇండెక్స్‌ 52 వారాల కనిష్ట, గరిష్టాలు 89.16 – 104 శ్రేణిలో ఉంది.  

లాక్‌డౌన్‌ భయాలు...
2020 మార్చితో పోల్చితే 2021 మార్చిలో పసిడి దిగుమతులు 471 శాతం పెరిగి, దాదాపు 160 టన్నులుగా నమోదయ్యాయి. దిగుమతి సుంకాల తగ్గింపు, గరిష్ట స్థాయిల నుంచి ఎల్లో మెటల్‌ దిగిరావడం వంటి అంశాలు రిటైల్‌ కొనుగోలుదారులను పసిడి పట్ల ఆకర్షణకు గురిచేసినట్లు విశ్లేషణలు ఉన్నాయి. మార్చిలో గోల్డ్‌ ఫ్యూచర్‌ ఏడాది కనిష్టం రూ.43,320 కనిష్టానికి పడింది. రిటైల్‌ డిమాండ్‌ భారీగా ఉండడంతో వర్తకులు కొనుగోళ్లకు మొగ్గుచూపారని ముంబైకి చెందిన ఒక బులియన్‌ డీలర్‌ పేర్కొన్నారు. ఆభరణాలకు డిమాండ్‌ నెలకొనడంతో పసిడి ధర మరీ పడిపోకుండా కొంత మద్దతు పొందినట్లు ఆయన వివరించారు. ఇక ఏప్రిల్‌ నెలలో పసిడి దిగుమతులు 100 టన్నుల లోపునకు పడిపోయే అవకాశం ఉందని భావిస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో లాక్‌డౌన్‌ భయాలు నెలకొనడం దీనికి కారణం. ఆయా అంశాలు కూడా పసిడి ధరలను సమీప కాలంలో రూ.40,000పైన నిలబెడతాయన్న అంచనాలు ఉన్నాయి.  

మరిన్ని వార్తలు