పసిడి బాండ్‌ ధర @ రూ. 4,732

28 Aug, 2021 05:59 IST|Sakshi

ఆగస్టు 30–సెప్టెంబర్‌ 3 వరకు విక్రయం

ముంబై: సావరీన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీము తదుపరి విడత ఆగస్టు 30 నుంచి ప్రారంభం కానుంది. సెప్టెంబర్‌ 3న ముగుస్తుంది. దీనికోసం బంగారం ధరను గ్రాముకు రూ. 4,732గా నిర్ణయించినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ వెల్లడించింది. ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసేవారికి గ్రాముపై రూ. 50 డిస్కౌంటు లభిస్తుంది. ఈ ఏడాది మే–సెప్టెంబర్‌ మధ్యలో ఆరు విడతలుగా పసిడి బాండ్లను జారీ చేయాలని కేంద్రం నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఆరో విడత బాండ్ల విక్రయ ప్రక్రియ ప్రారంభం కానుంది.

బ్యాంకులు, స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌హెచ్‌సీఐఎల్‌), నిర్దేశిత పోస్టాఫీసులు, ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈల ద్వారా వీటిని కొనుగోలు చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వం తరఫున గోల్డ్‌ బాండ్లను రిజర్వ్‌ బ్యాంక్‌ జారీ చేస్తుంది. 2015 నవంబర్‌లో పసిడి బాండ్ల విక్రయం ప్రారంభించినప్పట్నుంచి ఈ ఏడాది మార్చి ఆఖరు నాటి దాకా ప్రభుత్వం రూ. 25,702 కోట్లు సమీకరించింది. 2020–21లో 12 విడతలుగా రూ. 16,049 కోట్ల విలువ జేసే బాండ్లను ఆర్‌బీఐ జారీ చేసింది.  

మరిన్ని వార్తలు