Gold Demand: ఇక వచ్చే ఏడాదిలోనే పుంజుకునేది.. కానీ, థర్డ్‌ వేవ్‌ ముప్పు!

20 Oct, 2021 12:28 IST|Sakshi

ముంబై: భారత్‌లో పసిడికి 2022లో భారీ డిమాండ్‌ నెలకొనే అవకాశం ఉందని ప్రపంచ స్వర్ణ మండలి(వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌) పేర్కొంది. అయితే కోవిడ్‌–19 సంబంధ సవాళ్లు కొనసాగుతున్న నేపథ్యంలో 2021 మాత్రం బంగారం డిమాండ్‌ తగ్గిపోతోందని నివేదిక అభిప్రాయపడింది. ‘భారత్‌లో బంగారం డిమాండ్‌కు చోదకాలు’(డబ్ల్యూజీసీ నివేదిక) శీర్షికన విడుదలైన నివేదికలో ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. 


► కోవిడ్‌–19తో యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో 2021 ముగిసేలోపు పసిడి డిమాండ్‌ ఊహించినదానికన్నా ఎక్కువగా పడిపోయే వీలుంది. అయితే దేశ వ్యాప్తంగా కరోనా ఆంక్షలు క్రమంగా సడలిపోతున్న నేపథ్యంలో పరిస్థితి క్రమంగా మెరుగుపడే వీలుంది.  2022 నాటికి డిమాండ్‌ పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

► అయితే కరోనా మూడవ వేవ్‌ సవాళ్లు తలెత్తితే మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుంది.  

► భారత్‌ పసిడి పరిశ్రమల మరింత పారదర్శకత, ప్రమాణాల దిశగా అడుగులు వేయాలి. ఈ విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలు అనుసరించాలి. తద్వారా దేశంలోని యువత, సామాజిక మార్పుల వల్ల ఈ పరిశ్రమ మరెంతగానో పురోగమించే అవకాశం ఉంది.  

► భారత్‌లో బంగారం డిమాండ్‌కు కొన్ని సవాళ్లు ఎదురవుతున్నాయి. గృహ పొదుపురేట్లు పడిపోతుండడం, వ్యవసాయ వేతనాలపై కోవిడ్‌–19 ప్రభావం వంటివి ఇందులో ఉన్నాయి.

► అయితే ఈ సవాళ్లు స్వల్పకాలికమైనవేనని భావిస్తున్నాం. కోవిడ్‌ సవాళ్లు కొనసాగుతున్నా.. పసిడి దిగుమతులు భారీగా పెరుగుతుండడం గమనార్హం. రిటైల్‌ డిమాండ్‌ క్రమంగా ఊపందుకునే అవకాశం ఉంది.. అని   వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ తన నివేదికలో పేర్కొంది.

ఇక బంగారం ధర, రుతుపవనాలు, పన్నుల్లో మార్పులు,  ద్రవ్యోల్బణం వంటివి బంగారం డిమాండ్‌పై స్వల్పకాలంలో ప్రభావితం చూపే అంశాలు. అయితే, గృహ ఆదాయం, పసిడిపై   పన్నులు దీర్ఘకాలిక డిమాండ్‌ని నడిపిస్తాయి.

చదవండి: బంగారం మీద ఎన్ని రకాల ట్యాక్స్ కట్టాలో తెలుసా?

మరిన్ని వార్తలు