గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నుంచి 141 కోట్లు వెనక్కి

10 Dec, 2020 08:18 IST|Sakshi

ఆగస్టు నుంచి 12 శాతం పడిన ధర 

సాక్షి,  న్యూఢిల్లీ: గోల్డ్‌ ఈటీఎఫ్‌(ఎక్స్చేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌)ల నుంచి ఇన్వెస్టర్లు గత నెలలో రూ.141 కోట్ల పెట్టుబడులు వెనక్కి తీసుకున్నారు. పుత్తడి ధరలు పుంజుకోవడంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడమే దీనికి ప్రధాన కారణమని నిపుణులంటున్నారు. వరుసగా  ఏడు నెలల నికర పెట్టుబడుల అనంతరం గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నుంచి ఈ నవంబర్‌లోనే పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది. కాగా గత ఏడాది ఇదే నెలలో గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లో రూ.8 కోట్ల నికర పెట్టుబడులు వచ్చాయని ఆంఫీ వెల్లడించింది. (శాంసంగ్‌ మేకిన్‌ ఇండియా ఉత్పత్తులు)

అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా (ఆంఫీ) వెల్లడించిన వివరాల ప్రకారం..

  • గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లో ఈ ఏడాది జనవరిలో నికర పెట్టుబడులు రూ.202 కోట్లుగా, ఫిబ్రవరిలో రూ.1,483 కోట్లుగా ఉన్నాయి.  
  • మార్చిలో మాత్రం రూ.195 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది.  
  • ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకూ వరుసగా ఏడు నెలల పాటు గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు కొనసాగాయి. ఏప్రిల్‌లో రూ.731 కోట్లు, మేలో రూ.815 కోట్లు, జూన్‌లో రూ.494 కోట్లు, జూలైలో రూ.921 కోట్లు, ఆగస్టులో రూ.908 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.597 కోట్లు, అక్టోబర్‌లో రూ.384 కోట్ల నికర పెట్టుబడులు గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి వచ్చాయి.
  •  ఈ సంవత్సరం మంచి రాబడులు ఇచ్చిన అసెట్‌గా గోల్డ్‌ ఈటీఎఫ్‌లు నిలిచాయి. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్‌ కాలానికి గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లో మొత్తం రూ.6,200 కోట్ల మేర నికర పెట్టుబడులు వచ్చాయి.
  • ఈ నవంబర్‌లో రూ.141 కోట్లు నికర పెట్టుబడుల ఉపసంహరణ జరగడంతో నవంబర్‌ చివరి నాటికి గోల్డ్‌ ఈటీఎఫ్‌ల నిర్వహణ ఆస్తులు రూ.13,240 కోట్లకు తగ్గాయి. ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి ఈ ఆస్తులు రూ.13,969 కోట్లుగా ఉన్నాయి. 

పుత్తడి... వ్యూహాత్మక ఆస్తి!
కరోనా వ్యాక్సిన్‌కు సంబంధించి సానుకూల వార్తలు వస్తుండటం, ఆర్థిక కార్యకలాపాలు సాధారణ స్థితికి రానుండటం, స్టాక్‌ మార్కెట్లు జోరుగా పెరుగుతుండటంతో భవిష్యత్తులో బంగారం ధరల విషయమై అనిశ్చితి నెలకొనే అవకాశాలు అధికంగా ఉన్నాయని మార్నింగ్‌స్టార్‌ ఇండియా ఎనలిస్ట్‌ హిమాంశు శ్రీవాత్సవ చెప్పారు. అందుకని ప్రస్తుతం ధరలు గరిష్ట స్థాయిల్లో ఉండటంతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోల్లో పుత్తడి...వ్యూహాత్మక ఆస్తి అని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్థిక మందగమన పరిస్థితుల్లో పుత్తడి సురక్షిత మదుపు సాధనంగా ఇన్వెస్టర్లను ఆదుకుంటుందని వివరించారు. పుత్తడి ఒక ప్రభావవంతమైన వైవిధ్యీకరణ ఆస్తి అని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు