పెట్టుబడులకు ‘బంగారం’! 

31 Oct, 2020 08:09 IST|Sakshi

సెప్టెంబర్‌ త్రైమాసికంలో గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి రూ.2,426 కోట్లు  

సాక్షి, న్యూఢిల్లీ: కోవిడ్‌ మహమ్మారి తీవ్రత, ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడులకు పసిడి ఆకర్షణీయంగా నిలిచింది. మూడవ త్రైమాసికం (జూలై–సెప్టెంబర్‌)లో గోల్డ్‌ ఎక్సే్చంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (ఈటీఎఫ్‌)లోకి రూ.2,426 కోట్ల నికర పెట్టుబడులు వచ్చినట్లు భారత్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ సంఘం (యాంఫీ) తాజా గణాంకాలు తెలిపాయి.

కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... 
⇔ 2019 జూలై–సెప్టెంబర్‌ మధ్య గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి వచ్చిన మొత్తం కేవలం రూ.172 కోట్లే.  
⇔ గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి క్యూ2లో రూ.5,957 కోట్ల నికర పెట్టుబడులు వస్తే, ఇందులో గోల్డ్‌ ఈటీఎఫ్‌లదే అధిక మొత్తం.  
⇔ నెలవారీగా చూస్తే, జనవరిలో గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి రూ.202 కోట్ల నికర పెట్టుబడులు వచ్చాయి. ఫిబ్రవరిలో ఈ పెట్టుబడుల విలువ రూ.1,483 కోట్లుగా ఉంది. అయితే రూ.195 కోట్ల ఉపసంహరణలు జరిగాయి. లాభాల స్వీకరణ దీనికి కారణం.  
⇔ ఇక ఏప్రిల్‌ (రూ.731 కోట్లు), మే (రూ.815 కోట్లు), జూన్‌ (రూ.494 కోట్లు), జూలై (రూ.921 కోట్లు), ఆగస్టు (రూ.908 కోట్లు), సెప్టెంబర్‌ (రూ.597 కోట్లు)లో నికర పెట్టుబడులు కొనసాగాయి.  
⇔ గోల్డ్‌ ఫండ్స్‌ నిర్వహణలో ఉన్న మొత్తం విలువ (ఏయూఎం) సెప్టెంబర్‌ 2020 నాటికి రూ.13,590 కోట్లు. 2019 సెప్టెంబర్‌ ముగింపునాటికి ఈ విలువ రూ.5,613 కోట్లుగా ఉంది.  

ఆర్థిక అనిశ్చితే కారణం.. 
ప్రపంచవ్యాప్తంగా ఒడిదుడుకుల మార్కెట్‌ను ఇన్వెస్టర్లు చూస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో పెట్టుబడులకు పసిడే సురక్షితమైనదని  భావిస్తున్నారు. మార్కెట్లు దాదాపు రికవరీ బాటన  నడుస్తూ, కోవిడ్‌–19 ముందస్తు స్థాయికి చేరుకున్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ అనిశ్చితి తొలగిపోని పరిస్థితి కొనసాగుతుండడం ఇక్కడ గమనార్హం.  గోల్డ్‌ ఈటీఎఫ్‌ల పెట్టుబడులు గత ఏడాది కాలంగా మంచి రిటర్న్స్‌ అందించడానికి ఆర్థిక అనిశ్చితే కారణం. దీనికి ప్రస్తుతం  కరోనా మహమ్మారి కూడా తోడయ్యింది. అమెరికా ఎన్నికలు, ఫలితాలు రానున్న రెండు నెలల్లో ఈక్విటీ మార్కెట్లపై ప్రభావం చూపుతాయి. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు సురక్షితమైన హెడ్జింగ్‌ సాధనంగా గోల్డ్‌ ఈటీఎఫ్‌లనే ఎంచుకుంటారని భావిస్తున్నాం.

అంతక్రితం రెండు నెలలతో పోల్చితే, సెప్టెంబర్‌లో గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి పెట్టుబడులు తగ్గినా, ఇక్కడ పాజిటివ్‌ అవుట్‌లుక్‌ మాత్రమే కనబడుతోంది. కోవిడ్‌ కేసులు ప్రపంచవ్యాప్తంగా తిరిగి పెరుగుతుండడం, ఉద్దీపన చర్యలతో వ్యవస్థలోకి వస్తున్న అధిక ద్రవ్య లభ్యత (లిక్విడిటీ), కేంద్ర బ్యాంకులు అనుసరిస్తున్న తక్కువ వడ్డీరేట్ల విధానం వంటి అంశాల వల్ల పెట్టుబడులు సురక్షిత సాధనమైన పసిడిలోకే మళ్లే అవకాశాలే ఉన్నాయి. గోల్డ్‌ ఈటీఎఫ్‌లు, గోల్డ్‌ మ్యూచువల్‌ ఫండ్స్, సావరిన్‌ గోల్డ్‌ బాండ్లు లేదా ఫిజికల్‌ గోల్డ్‌వైపు ఇన్వెస్టర్లు దృష్టి సారిస్తారని భావిస్తున్నాం.  – దివామ్‌ శర్మ, గ్రీన్‌ పోర్ట్‌ఫోలియో సహ వ్యవస్థాపకులు

మరిన్ని వార్తలు