భారీగా కుంగిన బంగారం దిగుమతులు

18 Oct, 2020 12:39 IST|Sakshi

ముంబై : కోవిడ్‌-19 నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతులు భారీగా పడిపోయాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో బంగారం దిగుమతులు ఏకంగా 57 శాతం పతనమై రూ 50,658 కోట్లకు పరిమితమయ్యాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి. గత ఏడాది ఇదే కాలంలో రూ 1,10,259 కోట్ల విలువైన బంగారాన్ని భారత్‌ దిగుమతి చేసుకుంది. వెండి దిగుమతులు సైతం ఈ ఏడాది ఏప్రిల్‌-సెప్టెంబర్‌లో ఏకంగా 63.4 శాతం పతనమయ్యాయి.

కరోనా వైరస్‌ విజృంభణతో ఖరీదైన లోహాలకు డిమాండ్‌ తగ్గడంతోనే బంగారం, వెండి దిగుమతులు భారీగా తగ్గాయి. బంగారం, వెండి దిగుమతులు భారీగా తగ్గడంతో దేశ వర్తక లోటు కొంత మేర మెరుగుపడింది. గత ఏడాది ఏప్రిల్‌-సెప్టెంబర్‌లో దేశ వర్తక లోటు 8892 కోట్ల డాలర్లు కాగా, ఇప్పుడది ఏకంగా 2344 కోట్ల డాలర్లకు దిగిరావడం ఊరట కలిగిస్తోంది. అతిపెద్ద బంగారం దిగుమతిదారుగా భారత్‌ ఏటా 800 నుంచి 900 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటుంది. ఇక ఈ ఏడాది దేశం నుంచి జెమ్స్‌, జ్యూవెలరీ ఎగుమతులు కూడా 55 శాతం మేర దెబ్బతిన్నాయి. చదవండి : అప్పటి వరకూ.. పసిడి పరుగే!

మరిన్ని వార్తలు