భారీగా పెరిగిన పసిడి దిగుమతులు

19 Apr, 2021 13:19 IST|Sakshi

2020-21లో దిగుమతులు 23శాతం అప్‌

దాదాపు రూ.2 లక్షల కోట్లు విలువైన బంగారం దిగుమతి

సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌ పసిడి డిమాండ్‌ పటిష్టంగా ఉంది. వాణిజ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గడచిన ఆర్థిక సంవత్సరం (2020-21) బంగారం దిగుమతులు 22.58 శాతం పెరిగాయి. విలువలో ఇది 34.6 బిలియన్‌ డాలర్లు (దాదాపు 2.54 లక్షల కోట్లు). 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఈ విలువ 28.23 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.2 లక్షల కోట్లు). ఇక వెండి దిగుమతుల విలువ ఇదే కాలంలో ఏకంగా 71 శాతం పెరిగి 791 మిలియన్‌ డాలర్లకు చేరింది. పసిడి దిగుమతులు పెరగడం వాణిజ్యలోటు (ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం) పడుతోంది. ఇది కరెంట్‌ అకౌంట్‌ లోటు (దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసం)పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక వేత్తలు అభిప్రాయపడుతున్నారు.  

పసిడి దిగుమతులు పెరగడానికి దేశీయ డిమాండ్‌ ప్రధాన కారణమని రత్నాలు, ఆభరణాల ఎగుమతుల అభివృద్ధి మండలి (జీజేఈపీసీ) చైర్మన్‌ కొలిన్‌ షా తెలిపారు. రానున్న అక్షయ తృతీయ, పెళ్లిళ్ల సీజన్‌ నేపథ్యంలో పసిడికి డిమాండ్‌ మరింత పెరిగే అవకాశం ఉందన్నది నిపుణుల అభిప్రాయం. పసిడిని దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత్‌ మొదటి వరుసలో ఉంటుంది. వార్షికంగా 800 నుంచి 900 టన్నుల పసిడిని దిగుమతి చేసుకుంటోంది. ప్రభుత్వం 2021-22 బడ్జెట్‌లో యల్లో మెటల్‌పై దిగుమతి సుంకాన్ని 12.5 శాతం  నుంచి 10 శాతానికి తగ్గించింది. ఇందులో 7.5 శాతం కస్టమ్స్‌ సుంకం కాగా, 2.5 శాతం వ్యవసాయ మౌలిక వనరులు, అభివృద్ధి సెస్‌కు ఉద్దేశించినది.

>
మరిన్ని వార్తలు