బంగారం ఆభరణాల వర్తకులకు మరింత ఆదాయం

17 Sep, 2021 10:29 IST|Sakshi

ముంబై: బంగారం ఆభరణాల విక్రయదారులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయం 12–14 శాతం అధికంగా ఉంటుందని రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ అంచనా వేసింది. బంగారం ధరలు స్థిరంగా ఉండడానికితోడు వివాహాలు, పండుగల కోసం ఆభరణాలపై ఖర్చు చేయడం ఇందుకు మద్దతుగా నిలుస్తాయని పేర్కొంది.

వరుసగా రెండు సంవత్సరాల క్షీణత తర్వాత ఆదాయంలో వృద్ధి ఉంటుందన్న అంచనాకు వచ్చింది. 2019–20, 2020–21 సంవత్సరాల్లో మూడు శాతం, ఎనిమిది శాతం చొప్పున ఆభరణాల విక్రేతల ఆదాయం క్షీణించినందున.. తక్కువ స్థాయిల నుంచి (లోబేస్‌) చూస్తే వృద్ధి మెరుగ్గా ఉండొచ్చని తన నివేదికలో పేర్కొంది. ‘‘2019 జూలైలో బడ్జెట్‌ సందర్భంగా బంగారం దిగుమతిపై సుంకాన్ని 12.5 శాతానికి పెంచడం డిమాండ్‌పై ప్రభావం చూపంచగా.. 2020–21లో కరోనా వల్ల విధించిన లాక్‌డౌన్‌లతో దుకాణాలు మూతపడి ఆదాయంపై ప్రభావం పడేలా చేసింది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సంఘటిత ఆభరణాల వర్తకులకు తక్కువ దిగుమతి సుంకం వల్ల.. హాల్‌మార్క్‌ తప్పనిసరి చేయడం వల్ల ఆదాయం పెరగనుంది. అసంఘటిత రంగంలోని వారితో పోలిస్తే ఈ మార్పులు సంఘటిత రంగంలోని వారి పోటీతత్వాన్ని పెంచుతాయి’’ అని క్రిసిల్‌ పేర్కొంది. 2020–21లో క్రిసిల్‌ రేటింగ్‌ ఇచ్చిన 86 ఆభరణాల సంస్థల ఉమ్మడి ఆదాయం రూ.62,000 కోట్లుగా ఉండడం గమనార్హం.  

చదవండి: అంత బంగారాన్ని నోట్లో ఎలా దాచర్రా సామి..!

మరిన్ని వార్తలు