పసిడి పరుగులు, బంగారు ఆభరణాల రిటైలర్ల ఆదాయం పైపైకి!

31 Mar, 2022 08:07 IST|Sakshi

న్యూఢిల్లీ: బంగారు ఆభరణాల రిటైలర్ల ఆదాయం ఏప్రిల్‌తో ప్రారంభమయ్యే వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2022–23) 12–15 శాతం మేర పెరిగే అవకాశం ఉందని రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ బుధవారం తెలిపింది. ఇందుకు స్థిరమైన గిరాకీ, పసిడి అధిక ధర ఇందుకు కారణమవుతాయని తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) 20–22 శాతం ఆదాయ అంచనాలు ఉన్నట్లు పేర్కొంది. 

వార్షికంగా ఆదాయాలు తగ్గుతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ, 2021–22లో భారీ ఆదాయాల నమోదుకు మహమ్మారి ప్రారంభ దశ (2020–21) లో బేస్‌ ఎఫెక్ట్‌ కారణమని తెలిపింది. క్రిసిల్‌  రేటింగ్స్‌ ఇస్తున్న 82 సంస్థల పనితీరు ఆధారంగా నివేదిక రూపొందింది. ఈ రంగ మొత్తం ఆదాయంలో వీటి వాటా  40 శాతం. క్రిసిల్‌ నివేదికలోని మరికొన్ని అంశాలను పరిశీలిస్తే... 

►ఆపరేటింగ్‌ మార్జిన్లు 2022–2023 ఆర్థిక సంవత్సరంలో వార్షికంగా 50–70 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శౠం) 7.3–7.5 శాతం శ్రేణిలో మెరుగుపడతాయి. పెరిగిన బంగారం ధరలు, మెరుగైన నిర్వహణ వంటి అంశాలు దీనికి కారణం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ లాభాలు 12–15 శాతం పెరుగుతాయి. ఫలితంగా పరిశ్రమపై రుణ భారాలు తగ్గే వీలుంది.  

►అధిక మూలధన వ్యయం, ఇన్వెంటరీలు ఉన్నప్పటికీ, వచ్చే ఆర్థిక సంవత్సరంలో వ్యవస్థీకృత ఆభరణాల సంస్థల క్రెడిట్‌ ఔట్‌లుక్‌ను ‘స్థిరంగా’ ఉంటుంది.  

►వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆభరణాల డిమాండ్‌ స్థిరంగా ఉంటుంది. డిమాండ్‌ పరిమాణం 8–10 శాతం వృద్ధి చెంది 600–650 టన్నుల మహమ్మారి ముందస్తు స్థాయిలకు చేరుకుంటుంది.  కోవిడ్‌–19 అనంతరం వ్యాపార కార్యకలాపాలను మామూలు స్థితికి చేరుకుంటుండడం దీనికి ప్రధాన కారణం.  

► డిమాండ్‌ స్థిరీకరణతో, వ్యాపార విస్తరణ విలువ వచ్చే ఆర్థిక సంవత్సరం రూ. 200–250 కోట్లు ఉంటుంది. తద్వారా ఈ పరిమాణం మహమ్మారి ముందస్తు స్థాయికి చేరుకుంటుంది.  

► భారత్‌పై నాల్గవ వేవ్‌ సవాళ్లు తలెత్తడం, అలాగే సుంకాల పెంపు వంటి చర్యలు ఆభరణాల కొనుగోళ్లకు సంబంధించి వినియోగదారు ఆలోచనలో మార్పు తీసుకువస్తాయి.  

► బంగారం అధిక దిగుమతులు భారత్‌ కరెంట్‌ అకౌంట్‌ లోటు (క్యాడ్‌– దేశంలోకి వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) పెరగడానికి దారితీసే అంశం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ రేటు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 2 శాతం పైగా నమోదవుతుందన్న అంచనాలు ఉన్నాయి.   

మరిన్ని వార్తలు