కరోనా : బంగారంపై రుణాలకు భారీ డిమాండ్‌

24 Feb, 2021 08:00 IST|Sakshi

కరోనా సమయంలో  బంగారంపై రుణాల పట్ల ఆసక్తి 

రుణాల్లో భారీ వృద్ధి మెరుగ్గా ఆస్తుల నాణ్యత 

చెల్లింపుల్లో విఫలమైనా, హామీగా బంగారం 

సాక్షి, న్యూఢిల్లీ: ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలే కాదు.. బ్యాంకులు సైతం బంగారం రుణాల పట్ల ఉత్సాహంగా ఉన్నాయి. బంగారం, బంగారం ఆభరణాలను హామీగా ఉంచుకుని, రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు అమితాసక్తి చూపిస్తున్నాయి. ఒకవేళ రుణ చెల్లింపుల్లో రుణ గ్రహీత విఫలమైనా.. వేలం వేసి బకాయిల కింద సర్దుబాటు చేసుకునే రక్షణ ఉండడంతో బ్యాంకులు ఈ విభాగం పట్ల సౌకర్యంగా ఉన్నాయి. ఆస్తుల నాణ్యత మెరుగ్గా ఉండడం-21 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల కాలంలో (2020 ఏప్రిల్‌-డిసెంబర్‌) బ్యాంకులు అధిక లిక్విడిటీ సాధనాలైన బంగారం లేదా ప్రభుత్వ సెక్యూరిటీలపై తనఖా రుణాలు ఇచ్చేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టు గణాంకాలు తెలియజేస్తున్నాయి. కారణం కరోనా కారణంగా ఆర్థిక వ్యవస్థ చతికిలపడడంతో రుణ గ్రహీతల చెల్లింపుల సామర్థ్యం దెబ్బతినే అవకాశం ఉండొచ్చన్న ఆందోళనే బ్యాంకులు బంగారం రుణాలపై ఎక్కువగా దృష్టి సారించడానికి కారణమని తెలుస్తోంది. 

ఎస్‌బీఐ రుణాలు నాలుగు రెట్లు  
ఎస్‌బీఐ ‘పర్సనల్‌ గోల్డ్‌ లోన్‌’ పుస్తకం కేవలం ఆరు నెలల్లోనే (2020 జూలై-డిసెంబర్‌) నాలుగు రెట్లు పెరగడం దీన్నే రుజువు చేస్తోంది. ఎస్‌బీఐ పర్సనల్‌ గోల్డ్‌ లోన్‌ పోర్ట్‌ఫోలియో డిసెంబర్‌ చివరికి రూ.17,492 కోట్లుగా ఉంది. ఎస్‌బీఐకి ఈ రుణ విభాగంలో స్థూల ఎన్‌పీఏలు కేవలం 0.04 శాతమే. బ్యాంకు ఆఫ్‌ బరోడా బంగారంపై ఇచ్చిన వ్యవసాయ రుణాలు డిసెంబర్‌ చివరికి వార్షికంగా 29 శాతం పెరిగి రూ.21,116 కోట్లకు చేరుకున్నాయి. 2019 డిసెంబర్‌కు ఇది రూ.16,325 కోట్లుగా ఉండడం గమనార్హం. ‘‘వ్యవసాయ రుణ విభాగాన్ని పరిశీలిస్తే 40 శాతం వృద్ధి (రుణాలకు డిమాండ్‌) బంగారం రుణాల నుంచే ఉంటోంది. మా మొత్తం వ్యవసాయ రుణాల్లో 21 శాతం బంగారంపై ఇచ్చినవే. రానున్న రోజుల్లో వ్యవసాయ రుణాల్లో వృద్ధి 40–50 శాతం మేర బంగారం రూపంలోనే ఉంటుందని అంచనా వేస్తున్నాము’’ అంటూ బ్యాంకు ఆఫ్‌ బరోడా ఎండీ, సీఈవో సంజీవ్‌ చందా చెప్పడాన్ని గమనించాలి. 

సీఎస్‌బీ బ్యాంకు సైతం..   
ఇక బ్యాంకింగ్‌ రంగంలో బంగారం రుణాల పోర్ట్‌ఫోలియో ఎక్కువగా ఉన్న (మొత్తం రుణ ఆస్తుల పరంగా) సీఎస్‌బీ బ్యాంకు గురించి కూడా ప్రస్తావించుకోవాలి. త్రిస్సూర్‌ కేంద్రంగా పనిచేస్తున్న సీఎస్‌బీ బ్యాంకు బంగారం రుణాల పోర్ట్‌ఫోలియో వార్షికంగా చూస్తే 60 శాతం వృద్ధితో డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి రూ.5,644 కోట్లకు విస్తరించింది. 2019 డిసెంబర్‌ నాటికి బ్యాంకు బంగారం రుణాల పుస్తకం రూ.3,523 కోట్లు కావడం గమనార్హం. బ్యాంకు మొత్తం రుణాల్లో బంగారం రుణాల వాటా 40 శాతానికి చేరుకుంది. ‘‘మా బంగారం రుణాల పుస్తకాన్ని తగ్గించుకోబోము. కానీ, అదే సమయంలో ఇతర రుణ పుస్తకాల సైజును పెంచుకుంటాము. దాంతో మొత్తం మీద చూస్తే బంగారం రుణాల వాటా తగ్గనుంది. మా బంగారం రుణ పుస్తకం కేవలం రూ.6,000 కోట్లే. కానీ, ఒక అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు బంగారం రుణ పుస్తకం అయితే ఏకంగా రూ.70,000 కోట్ల స్థాయిలో ఉంది. కనుక నేడు బంగారం రుణాల్లోనూ కచ్చితంగా వాటా ఉండాల్సిందే’’ అని అని సీఎస్‌బీ బ్యాంకు ఎండీ, సీఈవో సీవీఆర్‌ రాజేంద్రన్‌ పేర్కొన్నారు.  

ధరల పెరుగుదలతో సౌకర్యం.. 
ఇతర ప్రైవేటు బ్యాంకుల్లోనూ బంగారం రుణాలు విస్తరిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఫెడరల్‌ బ్యాంకు బంగారం రుణ పోర్ట్‌ఫోలియో వార్షికంగా చూస్తే 67 శాతం వృద్ధితో డిసెంబర్‌ త్రైమాసికం చివరికి రూ.14,000 కోట్లుగా ఉంది. అదే కరూర్‌ వైశ్యా బ్యాంకు మొత్తం రుణాల్లో బంగారంపై ఇచ్చిన రుణాలు 2020 డిసెంబర్‌కు 23 శాతానికి (రూ.12,069 కోట్లకు) చేరాయి. 2019 డిసెంబర్‌కు బంగారం రుణాల వాటా 17 శాతంగా ఉంది. బంగారం ధరలు పెరుగుతూ ఉండడంతో రుణదాలు, రుణ స్వీకర్తలు ఈ రుణాల విషయంలో సౌకర్యంగా ఉన్నట్టు రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా గ్రూపు హెడ్‌ కార్తీక్‌ శ్రీనివాసన్‌ చెప్పారు.   

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు