బంగారం కొనుగోలుదారులకు శుభవార్త!

30 Jun, 2021 15:50 IST|Sakshi

మీరు బంగారం కొనుగోలు చేయాలని చూస్తున్నారా? అయితే, మీకు ఒక శుభవార్త. పుత్తడి ధరలు ఎప్పుడు లేనంతగా మూడు నెలల కనిష్టానికి చేరాయి. బుధవారం నాటి మార్కెట్‌లో పసిడి ధరలు భారీగా పడిపోయాయి. 2016 తర్వాత భారీగా ధర పడిపోయిన నెల ఇదేనని నిపుణులు పేర్కొంటున్నారు. నేడు దేశ రాజధాని ఢిల్లీ బులియన్ జువెలరీ మార్కెట్లో బంగారం ధరలు పడిపోయాయి. నిన్న 47,079 రూపాయలుగా ఉన్న 10 గ్రాముల స్వచ్చమైన 24 క్యారెట్ల బంగారం ధర సుమారు రూ.300 పడిపోయి 46,773 రూపాయలకు చేరుకుంది. జూన్ 17 తర్వాత ఇంత మొత్తంలో బంగారం ధర పడిపోవడం ఇదే మొదటి సారి. ఇక ఆభరణాల తయారీలో వినియోగించే 22 క్యారెట్ల బంగరం ధర రూ.43,124 నుంచి రూ.42,844కు పడిపోయింది.

ఈ నెలలో 10గ్రాముల బంగారం ధర 7.6 శాతం క్షీణించగా, ఈ త్రైమాసికంలో 3.2 శాతం ఎగిసింది. గత ఏడాది రూ.56,200 గరిష్టం నుంచి 10వేల రూపాయలు పడిపోయింది. ఇక ఈ నెలలోనే 2,700 రూపాయలు దిగి వచ్చింది. ఇక మన హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.360 క్షీణించి రూ.43,750కు పడిపోయింది. స్వచ్చమైన 24 క్యారెట్ల బంగారం ధర రూ.380 క్షీణించి రూ.47,730కు చేరుకుంది. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగానే క్షీణించాయి. నిన్న 68,269 రూపాయలుగా ఉన్న కేజీ వెండి ధర రూ.522 క్షీణించి రూ.67,747కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లలో, బంగారు ధర ఔన్సుకు 1,763.63 డాలర్లకు చేరుకుంది. అంటే, నాలుగు సంవత్సరాలలో ఇదే అతిపెద్ద నెలవారీ పతనం. 

చదవండి: SpaceX CEO: ఎలోన్ మస్క్ ఆసక్తికర ట్వీట్!

>
మరిన్ని వార్తలు