రూ. 51,500- రూ. 70,600 దాటేశాయ్‌ 

5 Jan, 2021 15:22 IST|Sakshi

పసిడి, వెండి ధరల జోరు- 8 వారాల గరిష్టం

ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి రూ. 51,610కు

వెండి కేజీ రూ. 604 అప్‌- రూ. 70,640వద్ద ట్రేడింగ్‌

న్యూయార్క్‌ కామెక్స్‌లో 1,950 డాలర్లకు బంగారం

27.61 డాలర్ల వద్ద ట్రేడవుతున్న వెండి ఔన్స్

న్యూయార్క్/ ముంబై: కరోనా కొత్త స్ట్ర్రెయిన్‌ కారణంగా మరోసారి బంగారం, వెండి ధరలు బలపడ్డాయి. దేశీయంగా ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి రూ. 51,610కు చేరగా.. వెండి కేజీ రూ. 70,640 వద్ద ట్రేడవుతోంది. ఇక న్యూయార్క్‌ కామెక్స్‌లోనూ సోమవారం భారీగా బలపడటం ద్వారా పసిడి ఔన్స్‌ 1950 డాలర్లకు చేరగా.. వెండి 27.6 డాలర్లను తాకింది. వెరసి పసిడి ధరలు 8 వారాల గరిష్టాలకు చేరాయి. ఇంతక్రితం నవంబర్‌ 9న మాత్రమే పసిడి ఈ స్థాయిలో ట్రేడయినట్లు బులియన్‌ వర్గాలు పేర్కొన్నాయి. బ్రిటన్‌లో కఠిన లాక్‌డవున్‌ ఆంక్షలకు తెరతీయగా.. టోక్యోసహా పలు ప్రాంతాలలో జపాన్‌ ఎమర్జెన్సీ విధించనున్న వార్తలు పసిడికి డిమాండ్‌ను పెంచినట్లు తెలియజేశాయి.  (స్ట్ర్రెయిన్‌ ఎఫెక్ట్‌- పసిడి, వెండి హైజంప్‌)

గత వారం అమెరికా ప్రభుత్వం భారీ ప్యాకేజీకి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన నేపథ్యంలో కొద్ది రోజులుగా పసిడి, వెండి ధరలు మెరుస్తున్న సంగతి తెలిసిందే. కోవిడ్‌-19 కట్టడికి పలు వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్నప్పటికీ రూపు మార్చుకుని వణికిస్తున్న కరోనా వైరస్‌ కారణంగా మళ్లీ సంక్షోభ పరిస్థితులు తలెత్తవచ్చన్న ఆందోళనలు పసిడికి డిమాండును పెంచుతున్నట్లు నిపుణులు వివరించారు. 

హుషారుగా..
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 186 బలపడి రూ. 51,610 వద్ద ట్రేడవుతోంది. ఇది ఫిబ్రవరి ఫ్యూచర్స్‌ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 51,333 వద్ద కనిష్టాన్ని తాకిన పసిడి తదుపరి 51,649 వద్ద గరిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్‌ రూ. 604 జంప్‌చేసి రూ. 70,640 వద్ద కదులుతోంది. రూ. 70,060 వద్ద ఫ్లాట్‌గా ప్రారంభమైన వెండి ఆపై ఒక దశలో రూ. రూ. 70,695 వరకూ దూసుకెళ్లింది. 

లాభాలతో..
న్యూయార్క్‌ కామెక్స్‌లో ప్రస్తుతం పసిడి ఔన్స్‌ 0.2 శాతం పెరిగి 1,950 డాలర్ల సమీపంలో ట్రేడవుతోంది. స్పాట్‌ మార్కెట్లోనూ 0.15 శాతం బలపడి 1,945 డాలర్లను అధిగమించింది. వెండి మరింత అధికంగా ఔన్స్ 1 శాతం పుంజుకుని 27.61 డాలర్ల వద్ద కదులుతోంది. పసిడి ఫిబ్రవరి కాంట్రాక్ట్‌కాగా..  వెండి మార్చి ఫ్యూచర్స్‌ ధరలు. 

మరిన్ని వార్తలు