కొత్త ‘బంగారు’ లోకం

28 Mar, 2023 00:16 IST|Sakshi

త్వరలోనే నూతన గరిష్టాలకు బంగారం

ఔన్స్‌ 2075 డాలర్లు సాధ్యమే 

కరోనా ముందున్న స్థాయికి చేరుకోకపోవచ్చు

న్యూఢిల్లీ: బంగారం ధర నూతన గరిష్ట స్థాయిలకు రానున్న వారాల్లో చేరుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఔన్స్‌ ధర పూర్వపు గరిష్ట స్థాయి అయిన 2,075 డాలర్లను దాటిపోవచ్చని భావిస్తున్నారు. అమెరికాలో బ్యాంకింగ్‌ సంక్షోభం తలెత్తడంతో, ఇది అంతర్జాతీయ ఫైనాన్షియల్‌ మార్కెట్లో అనిశ్చితికి దారితీయడం చూస్తున్నాం. దీంతో అనిశ్చితుల్లో సురక్షిత సాధనంగా భావించే బంగారంలోకి మరిన్ని పెట్టుబడులు వెళ్లొచ్చని, ఫలితంగా ధరలకు రెక్కలు వస్తాయన్న విశ్లేషణ వినిపిస్తోంది.  

నెలలో 7.5 శాతం రాబడి
ఇటీవల బంగారం ధర ఔన్స్‌కి (28.35 గ్రాములు) 2,000 డాలర్లను తాకింది. 2022 మార్చి తర్వాత ఇది గరిష్ట స్థాయి. తాజాగా లండన్‌ మార్కెట్లో  ఔన్స్‌కి 1,952 డాలర్లకు పరిమితం అయింది. అంతర్జాతీయంగా చూస్తే గడిచిన నెల రోజుల్లో బంగారం ధరలు 7.75 శాతం మేర లాభపడ్డాయి. ఎంసీఎక్స్‌ మార్కెట్లో ఏప్రిల్‌ కాంట్రాక్టు గోల్డ్‌ 10 గ్రాములకు రూ.60,000ను తాకింది.

  ‘‘అంతర్జాతీయంగా పెరిగిపోతున్న ఆర్థిక అనిశ్చితులు బంగారం ధరని ఔన్స్‌కి 2,075 డాలర్ల గరిష్ట స్థాయికి మళ్లీ తీసుకెళతాయని భావిస్తున్నట్టు ఫిచ్‌ సొల్యూషన్స్‌ తెలిపింది. ఈ స్థాయిలో బలమైన నిరోధం ఉన్నట్టు పేర్కొంది. యూఎస్‌ డాలర్‌ బలంగా ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. సిగ్నేచర్‌ బ్యాంక్, సిలికాన్‌ వ్యాలీ బ్యాంక్‌ వైఫల్యాలు ఇతర బ్యాంకులకు విస్తరించేది చాలా తక్కువేనని ఫిచ్‌ సొల్యూషన్స్‌ అంచనా వేసింది.  

ఫెడ్‌ పెంపు ప్రభావం..
ఇవే ఆర్ధిక అనిశ్చిత పరిస్థితులు కొనసాగితే బంగారం ర్యాలీకి మద్దతుగా నిలుస్తాయని.. అతి త్వరలోనే ఔన్స్‌కి 2,075 డాలర్లను చూస్తామని బ్రిటన్‌ కేంద్రంగా పనిచేసే ఐజీ బ్యాంక్‌ పేర్కొంది. అమెరికా ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపుకు విరామం ఇస్తే కనుక అది బంగారం ధరలకు బూస్ట్‌నిస్తుందని ఐఎంజీ థింక్‌ అంచనా వేస్తోంది. 2023 సంవత్సరానికి ఫిచ్‌ సొల్యూషన్స్‌ తన అంచనాలను సవరించింది. ఔన్స్‌కి గతంలో వేసిన 1,850 డాలర్లను రూ.1,950 డాలర్లకు పెంచింది.

బ్యాంకింగ్‌ సంక్షోభం మాంద్యానికి దారితీయవచ్చనే అభద్రతా భావం ఇన్వెస్టర్లలో ఏర్పడినట్టు ఫిచ్‌ సొల్యూషన్స్‌ తెలిపింది. ‘‘ఫెడ్‌ వడ్డీ రేట్లు అంచనాలకు తగ్గట్టు 0.25 శాతం లేదా అంతకంటే తక్కువ పెంచితే, హాకిష్‌ ప్రసంగం లేకపోతే అది బంగారానికి చాలా సానుకూలం అవుతుంది. 2,040–2,050 డాలర్లను చూడొచ్చు. కామెక్స్‌లో అయితే 10 గ్రాముల ధర రూ.61,500కు చేరొచ్చు’’అని ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ రీసెచ్చ్‌ అనలిస్ట్‌ జతీన్‌ త్రివేది తెలిపారు. మార్కెట్లలో అనిశ్చితులు ఉన్నప్పుడు బంగారం ధర సహజంగానే పెరుగుతుందని ఏజెంల్‌ వన్‌ నాన్‌ అగ్రి కమోడిటీస్‌ ఏవీపీ ప్రథమేష్‌ మాల్యా అన్నారు.

బ్యాంకింగ్‌ సంక్షోభం శాంతిస్తే, ఫెడ్‌ అధిక పెంపు చేపట్టొచ్చని, అది బంగారం ధరల క్షీణతకు దారితీయవచ్చన్నారు. యూఎస్‌ ఫెడ్‌ దూకుడుగా రేట్లను పెంచుతుందన్న అంచనాలు ఇప్పుడు లేవని.. తాము అయితే బంగారంపై తటస్థం నుంచి బుల్లిష్‌గా ఉన్నామని, 2022 క్యూ4 నుంచి ఇదే విధానాన్ని కొనసాగిస్తున్నట్టు ఫిచ్‌ సొల్యూషన్స్‌ తెలిపింది. రానున్న వారాల్లో బంగారం ధరలో ఎన్నో  ఆటుపోట్లు చూడొచ్చని.. రానున్న సంవత్సరాల్లోనూ బంగారం ధర గరిష్ట స్థాయిల్లోనే కదలాడవొచ్చని, కరోనా ముందు నాటి స్థాయిలకు చేరుకోకపోవచ్చన్న అంచనాను వ్యక్తం చేసింది. 

మరిన్ని వార్తలు