2021లో బంగారం ధర ఎంత పెరగనుంది..?!

28 Dec, 2020 17:51 IST|Sakshi

సాక్షి,  ముంబై:  కరోనా కాలంలో బంగారం ధర భారీగా పుంజుకుంది.  ఈ ఏడాది 10 గ్రాముల పసిడి ధర వరుసగా పెరుగుతూ సరికొత్త గరిష్టాలను నమోదు చేసింది.  అయితే 2021 ఏడాదిలో కూడా పసిడి ధరల పరుగు మరింత వేగం అందుకుంటుందని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది.  తాజా ఉద్దీపన  చర్యలు,  బలహీనమైన అమెరికన్ డాలర్‌ తదితర  అంచనాల మధ్య,  కొత్త సంవత్సరంలో బంగారం 10 గ్రాములకు 63,000 రూపాయలకు చేరే అవకాశం ఉందని  విశ్లేషకుల అంచనా.

అగ్ర రాజ్యాల మధ్య యుద్ధ భయాలు, ట్రేడ్‌వార్‌ లాంటి వివిధ అనిశ్చిత సమయాల్లో పెట్టుబడికి ఎల్లప్పుడూ సురక్షితమైన స్వర్గంగా బంగారాన్ని పెట్టుబడిదారులు భావిస్తారు. దీనికి 2019 లో  చైనాలో మొదలై ప్రపంచమంతా విస్తరించి 2020లో తీవ్ర కల్లోలాన్ని రేపిన కరోనా మహమ్మారి  కూడా పుత్తడి ధరలనుభారీగా ప్రభావితం చేసింది. ఎంసీఎక్స్‌ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర  56,191 రూపాయల గరిష్ట స్థాయిని తాకింది. అలాగే అంతర్జాతీయంగా ఆగస్టులో మార్కెట్లో ఔన్సు ధర 2,075 డాలర్లు పలికిన సంగతి తెలిసిందే.

ఈ ఏడాది (2020)లో 10 గ్రాముల పుత్తడి  రూ.39,100 వద్ద ప్రారంభమై కరోనా విజృంభణతో  56,191 రూపాయల వద్ద ఆల్‌ టైం గరిష్టానికి చేరిందని కామ్‌ట్రెండ్జ్ రిస్క్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ సీఈఓ జ్ఞానశేకర్ తియగరాజన్  తెలిపారు. అయితే కరోనావైరస్ వ్యాక్సిన్ లభ్యతపై భారీ ఆశలు, కోవిడ్-19 తరువాత ఆర్థిక పునరుజ్జీవనం ఉన్నప్పటికీ బంగారం వైపు పెట్టుబడిదారులు మొగ్గు బలంగా ఉందని ఆయన నమ్ముతున్నారు. డాలర్‌ ఇంకా బలహీనతను నమోదు చేయవచ్చు. ఇది కూడా 2021లో మరోసారి పెట్టుబడులను ఆకర్షించేందుకు సానుకూల అంశమని తియరాజన్ పేర్కొన్నారు. అంతేకాదు  సెనేట్‌లో బలహీనమైన మెజారిటీ కారణంగా యుఎస్‌లో రాజకీయ ప్రమాదం, జో బిడెన్ నేతృత్వంలోని పరిపాలన సంస్కరణల అమలుకు గుదిబండగా మారుతుందినీ, ఇది బులియన్‌ మార్కెట్‌కు సానుకూల అంశమని అభిప్రాయపడ్డారు.  అలాగే భారత, చైనాలోగత కొన్ని సంవత్సరాలుగా  స్తబ్దుగా ఉన్న ఫిజికల్‌  గోల్డ్‌ డిమాండ్‌ 2021లో  కీలక దశకు చేరుకుంటుందనీ,  డిమాండ్‌ భారీగా పుంజుకుంటుందన్నారు. దీనికి తోడు రూపాయి కూడా స్థిరంగా ఉంటే, ధరలు 2021లో కనీసం రూ .60వేలను తాకవచ్చన్నారు. కోవిడ్‌-19 మహమ్మారి ఆంక్షలు, ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ ఆందోళన నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ సీనియర్ అనలిస్ట్ (కమోడిటీస్) తపన్ పటేల్ అంచనా ప్రకారం వచ్చే ఏడాదిలో కామెక్స్ లో  పుత్తడి ధర 2,150-2,390 డాలర్ల మధ్య కదలాడనుంది. అలాగే ఎంసీఎక్స్‌ లో 57 వేలు - 63 వేల రూపాయలు టార్గెట్‌గా ఉండనుంది.

మరిన్ని వార్తలు