పసిడి మరింత పైపైకి.. రానున్న రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం!!

26 Aug, 2021 10:40 IST|Sakshi

Gold Rates Increase: బంగారం ధర ఆకాశాన్నంటింది. దీంతో కొనుగోళ్లు లేక అమ్మకందారులు గత 6 నెలల నుంచి అందోళన చెందుతున్నారు. దీనికి తోడు వివిధ షాపింగ్‌ మాల్స్‌లో రెడిమెడ్‌ బంగారు అభరణాలు అందుబాటులో ఉండటంతో ప్రజలు అటువైపు మొగ్గు చూపుతున్నారు. శ్రావణమాసంలో అనేక పెండ్లిళ్లు శుభకార్యాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు భారీగా ఉంటాయని ఊహించిన అమ్మకందారులు నిరాశ చెందుతున్నారు. గత రెండేళ్ల నుంచి కరోనా, లాక్‌డౌన్, ఆన్‌సీజన్‌ తదితర కారణాలతో బంగారు అమ్మకాలు భారీగా తగ్గాయి.  

బులియన్‌ మార్కెట్‌లో  
గత ఐదు రోజుల నుంచి జిల్లా బులియన్‌ మార్కెట్లో 10గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 49,500 ఉంది. వెండి రూ. కిలో 64,100 నడుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడిరేటు పైకి చేరడంతో దేశీయ మార్కెట్లోను ఇదే ట్రెండ్‌ కొనసాగుతుందని బులియన్‌మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. బ్యాంకులు బంగారంపై తక్కువ రేటుకు రుణాలుస్తున్నాయి. రానున్న రోజులలో బంగారం ధరలు రూ. తులం 50వేలు చేరుకునే అవకాశం ఉందని అమ్మకందారులు చెబుతున్నారు.  

తగ్గిన అమ్మకాలు  
2020 మార్చిలో కరోనా నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించడంతో చాలా వ్యాపారాలు కుదేలయ్యాయి. దీంతో కొంత మంది ఉపాధి కోల్పొగా... కొంత మంది వేతన కోతలను ఎదుర్కొన్నారు. చిన్న వ్యాపారస్తులు తనాఖ పెట్టి తీసుకున్న రుణాలతో ప్రతికూల పరిస్థితులను అధిగమించే ప్రయత్నం చేశారు. మరికొంత మంది శుభకార్యాల కోసమని తక్కువ మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేశారు. దీంతో అమ్మకాలు ఆశించిన విధంగా జరుగక వ్యాపారులు అందోళన చెందుతున్నారు. 

పెరిగే అవకాశం ఉంది 
బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయి. దీంతో రానున్న దసరా, దీపావళి పండుగకు 10గ్రాముల, 24 క్యారెట్ల బంగారం రూ. 50వేలకు పైగా పెరిగే అవకాశం ఉంది. పండుగలతో సంబంధం లేకుండా అంతర్జాతీయ మార్కెట్లో బంగారం డిమాండ్‌ బాగా ఉంది.  
– చిలుక ప్రకాష్, బంగారం వ్యాపారి, కుమార్‌గల్లి   

అవసరానికే కొనుగోళ్లు  
కరోనా, ఈ మధ్య కాలంలో శుభకార్యాలకు ముహూర్తాలు లేకపోవడంతో బంగారం కొనుగోళ్లు భారీగా తగ్గాయి. షాపింగ్‌మాల్స్‌లలో రెడిమెడ్‌ బంగారు అభరణాలు లభిస్తుండటంతో అవసరానికి అక్కడ అభరణాలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఈ వృత్తిని నమ్ముకున్నవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 
– శ్రీనివాస్, బంగారం అమ్మకందారుడు  

రెడీమేడ్‌ ఆర్నమెంట్స్‌పై మక్కువ  
బంగారాన్ని కొనుగోలు చేసి అభరణాలను తయారుచేయడం ఇబ్బందిగా మారింది. దీంతో అనేక మంది ఆర్నమెంట్‌ బంగారం వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. బంగారం ధరలు భారీగా పెరగడం అందోళన కలుగజేస్తుంది. కేంద్ర ప్రభుత్వం ధరలను నియంత్రిచాలి. పెరుగుతున్న ధరలను తగ్గించాలి.
– శారద, గృహిణి, ప్రగతినగర్‌

చదవండి : యస్‌.. మేం ఆన్‌లైన్‌ బానిసలం

మరిన్ని వార్తలు