దంతేరాస్‌ ధమాఖా... 50 టన్నుల బంగారం సోల్డవుట్‌

12 Nov, 2021 13:13 IST|Sakshi

గోల్డ్‌ ఈటీఎఫ్‌లు.. అక్టోబర్‌లో రూ.303 కోట్ల పెట్టుబడులు 

న్యూఢిల్లీ: పండుగల సీజన్‌ కావడంతో అక్టోబర్‌లో బంగారం ఎక్సేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌ (గోల్డ్‌ ఈటీఎఫ్‌లు) పట్ల ఇన్వెస్టర్లలో ఆసక్తి కొనసాగింది. ఫలితంగా రూ.303 కోట్ల పెట్టుబడులు గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి వచ్చాయి. అంతకుముందు సెప్టెంబర్‌ నెలలో గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి రూ.446 కోట్ల పెట్టుబడులు రావడం గమనార్హం. ఆగస్ట్‌లో వచ్చిన పెట్టుబడులు కేవలం రూ.24 కోట్లుగానే ఉన్నాయని.. మ్యూచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ (యాంఫి) గణాంకాలు తెలియజేస్తున్నాయి. పండుగల సీజన్‌ కావడంతో గోల్డ్‌ ఈటీఎఫ్‌లకు డిమాండ్‌ కొనసాగినట్టు ఎల్‌ఎక్స్‌ఎంఈ వ్యవస్థాపకురాలు ప్రీతిరాతిగుప్తా పేర్కొన్నారు. 

భారీ దంతేరాస్‌ విక్రయాలు
ఈ ఏడాది దంతేరస్‌ సందర్భంగా 50 టన్నుల బంగారం విక్రయమైందని.. 2019తో పోలిస్తే 20 టన్నులు ఎక్కువని చెప్పారు. సెప్టెంబర్‌తో పోలిస్తే అక్టోబర్‌లో కాస్తంత పెట్టుబడులు తగ్గడానికి.. భౌతిక బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేసి ఉండొచ్చని మార్నింగ్‌స్టార్‌ రీసెర్చ్‌ మేనేజర్‌ హిమాన్షు శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు. అలాగే, బంగారం ధరలు పెరగడం కూడా ఒక కారణమై ఉంటుందన్నారు. అయినప్పటికీ అక్టోబర్‌లో వచ్చిన నికర పెట్టుబడుల పరిమాణాన్ని పరిశీలిస్తే ఇన్వెస్టర్లు ఇప్పటికీ బంగారానికి ప్రాధాన్యం ఇస్తున్నట్టు పేర్కొన్నారు. అక్టోబర్‌ చివరికి గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లో ఫోలియోల (పెట్టుబడి ఖాతా) సంఖ్య 8 శాతం పెరిగి 26.6 లక్షలకు చేరింది.

చదవండి:బంగారం ఎలా ఉన్నా మెరుస్తుంది..!

మరిన్ని వార్తలు