4 రోజుల నష్టాలకు చెక్‌- లాభాల్లో పసిడి

20 Nov, 2020 14:23 IST|Sakshi

ప్రస్తుతం రూ. 50,087 వద్ద ట్రేడవుతున్న బంగారం

ఎంసీఎక్స్‌లో రూ. 61,938 వద్ద కదులుతున్న వెండి

న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌ పసిడి 1,866 డాలర్లకు

24.37 డాలర్ల వద్ద కదులుతున్న ఔన్స్‌ వెండి

న్యూయార్క్/ ముంబై: గత నాలుగు రోజులుగా క్షీణ పథంలో పయనిస్తున్న బంగారం, వెండి ధరలు బలపడ్డాయి. ఫలితంగా నాలుగు రోజుల నష్టాలకు చెక్‌ పడింది. సహాయక ప్యాకేజీలకింద ఖర్చుచేయని నిధులను వెనక్కి ఇవ్వాలంటూ ఆర్థిక మంత్రి స్టీవ్‌ ముచిన్‌ తాజాగా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ను డిమాండ్‌ చేశారు. మరోవైపు ప్రభుత్వ సహాయక ప్యాకేజీలపై అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ 92.50కు బలపడింది. దీంతో పసిడి ఆటుపోట్ల మధ్య ప్రస్తుతం లాభాల బాటపట్టినట్లు  బులియన్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఎమర్జెన్సీ ప్రాతిపదికన తమ వ్యాక్సిన్లకు యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతి లభించగలదంటూ ఫైజర్‌, మోడర్నా అంచనా వేయడంతో వరుసగా నాలుగు రోజులపాటు పసిడి, వెండి ఫ్యూచర్స్‌లో ట్రేడర్లు అమ్మకాలకు దిగిన సంగతి తెలిసిందే. 

లాభాలతో
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 95 బలపడి రూ. 50,087 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 50,197 వద్ద గరిష్ఠాన్ని తాకింది. ఆపై రూ. 49,857 వద్ద కనిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ సైతం రూ. 428 ఎగసి రూ. 61,938 వద్ద కదులుతోంది. తొలుత రూ. 62,090 వద్ద గరిష్టానికి చేరిన వెండి తదుపరి రూ. 61,560 వరకూ వెనకడుగు వేసింది. చదవండి: (నాలుగో రోజూ పసిడి- వెండి.. వీక్‌)

సానుకూలంగా
న్యూయార్క్‌ కామెక్స్‌లో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు హుషారుగా కదులుతున్నాయి. పసిడి ఔన్స్‌(31.1 గ్రాములు) 0.2 శాతం పుంజుకుని1,866 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్‌ మార్కెట్లోనూ 0.1 శాతం లాభంతో 1,869 డాలర్లకు చేరింది. వెండి 0.8 శాతం లాభపడి ఔన్స్ 24.37 డాలర్ల వద్ద కదులుతోంది. 

నాలుగో రోజూ..
ఎంసీఎక్స్‌లో గురువారం 10 గ్రాముల బంగారం రూ. 335 క్షీణించి రూ. 49,990 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 50,200 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ. 49,720 వద్ద కనిష్టానికి చేరింది. వెండి కేజీ డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ సైతం రూ. 1,018 నష్టంతో రూ. 61,525 వద్ద స్థిరపడింది. తొలుత రూ. 62,182 వద్ద గరిష్టానికి చేరిన వెండి తదుపరి రూ. 60,710 వరకూ వెనకడుగు వేసింది. 

మరిన్ని వార్తలు