కన్సాలిడేషన్‌లో పసిడి, వెండి ధరలు

29 Sep, 2020 11:51 IST|Sakshi

ఎంసీఎక్స్‌లో  ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 50,183కు

రూ. 60,298 వద్ద ట్రేడవుతున్న కేజీ వెండి ఫ్యూచర్స్

‌న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌ పసిడి 1,883 డాలర్లకు

23.61 డాలర్ల వద్ద కదులుతున్న ఔన్స్‌ వెండి

దేశ, విదేశీ మార్కెట్లలో సోమవారం పుంజుకున్న పసిడి, వెండి ధరలు కన్సాలిడేషన్‌ బాట పట్టాయి. ప్రస్తుతం అటూఇటుగా ట్రేడవుతున్నాయి. ప్రభుత్వ సహాయక ప్యాకేజీపై అమెరికన్‌ కాంగ్రెస్‌లో చర్చలు ప్రారంభంకానుండటం, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ బలహీనపడటం వంటి అంశాలు సోమవారం పసిడి, వెండి ధరలకు బలాన్నిచ్చినట్లు బులియన్‌ వర్గాలు పేర్కొన్నాయి. ఇతర వివరాలు చూద్దాం..

మిశ్రమ బాట
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 50 లాభపడి రూ. 50,183 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ స్వల్పంగా రూ. 98 నష్టంతో రూ. 60,298 వద్ద కదులుతోంది. 

లాభపడ్డాయ్‌
సోమవారం ఎంసీఎక్స్‌లో బంగారం, వెండి ధరలు పుంజుకున్నాయి. 10 గ్రాముల పసిడి రూ. 474 బలపడి రూ. 50,133 వద్ద ముగిసింది. తొలుత 50,197 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 49,315 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. వెండి కేజీ రూ. 1,369 ఎగసి రూ. 60,396 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో రూ. 60,495 వరకూ పుంజుకున్న వెండి ఒక దశలో రూ. 57,652 వరకూ నీరసించింది.

ఫ్లాట్‌గా..
న్యూయార్క్‌ కామెక్స్‌లో సోమవారం హెచ్చుతగ్గుల మధ్య బలపడిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. ఫ్యూచర్స్‌లో ఔన్స్‌(31.1 గ్రాములు) పసిడి నామమాత్ర లాభంతో 1883 డాలర్లకు చేరగా.. స్పాట్‌ మార్కెట్లో నామమాత్ర నష్టంతో 1879 డాలర్ల వద్ద కదులుతోంది. ఇక వెండి ఔన్స్‌  దాదాపు యథాతథంగా 23.61 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

మరిన్ని వార్తలు