నాలుగో రోజూ పడిన పసిడి- వెండి

19 Nov, 2020 10:58 IST|Sakshi

వ్యాక్సిన్‌ వార్తలతో నాలుగు రోజులుగా వెనకడుగు

ప్రస్తుతం రూ. 50,186 వద్ద ట్రేడవుతున్న బంగారం

ఎంసీఎక్స్‌లో రూ. 62,112 వద్ద కదులుతున్న వెండి

న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌ పసిడి 1,866 డాలర్లకు

24.26 డాలర్ల వద్ద కదులుతున్న ఔన్స్‌ వెండి

పసిడికి రూ. 50,100-49,900 వద్ద సపోర్ట్స్‌

రూ. 50,500-50,700 వద్ద రెసిస్టెన్స్‌: విశ్లేషకులు

న్యూయార్క్/ ముంబై: గ్లోబల్‌ ఫార్మా దిగ్గజాలు ఫైజర్‌, మోడర్నా ఇంక్‌.. కోవిడ్‌-19కు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లు త్వరలో అందుబాటులోకి రాగలవన్న అంచనాలు డాలరు ఇండెక్సుకు బలాన్నిస్తుంటే.. బంగారం, వెండి ధరలను దెబ్బతీస్తున్నాయి. ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 0.2 శాతం పుంజుకుంది. దీంతో వరుసగా నాలుగో రోజు దేశ, విదేశీ మార్కెట్లలో పసిడి, వెండి ధరలు డీలా పడ్డాయి. ఎమర్జెన్సీ ప్రాతిపదికన తమ వ్యాక్సిన్లకు యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతి లభించగలదంటూ ఫైజర్‌, మోడర్నా అంచనా వేయడంతో పసిడి, వెండి ఫ్యూచర్స్‌లో ట్రేడర్లు అమ్మకాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు బులియన్‌ వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. పసిడికి రూ. 50,100-49,900 వద్ద సపోర్ట్‌ లభించవచ్చని, ఇదేవిధంగా రూ. 50,500-50,700 స్థాయిలో రెసిస్టెన్స్‌ కనిపించవచ్చని పృథ్వీ ఫిన్‌మార్ట్‌ కమోడిటీ, కరెన్సీ హెడ్‌ మనోజ్‌ జైన్‌ అంచనా వేశారు. ఇక ఎంసీఎక్స్‌లో వెండికి రూ. 62,100-61,100 వద్ద సపోర్ట్స్ లభించే వీలున్నదని‌, రూ. 63,000-63,500 స్థాయిలో రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చని అభిప్రాయపడ్డారు. ఇతర వివరాలు చూద్దాం..

బలహీనంగా
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 139 తక్కువగా రూ. 50,186 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. రూ. 50,200 వద్ద బలహీనంగా ప్రారంభమైంది. తదుపరి రూ. 50,149 వద్ద కనిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ సైతం రూ. 431 క్షీణించి రూ. 62,112 వద్ద కదులుతోంది. తొలుత రూ. 62,160 వద్ద గరిష్టానికి చేరిన వెండి తదుపరి రూ. 62,001 వరకూ వెనకడుగు వేసింది. 

వెనకడుగులో..
న్యూయార్క్‌ కామెక్స్‌లో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు వెనకడుగుతో కదులుతున్నాయి. పసిడి ఔన్స్‌(31.1 గ్రాములు) 0.4 శాతం నష్టంతో1,866 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్‌ మార్కెట్లోనూ 0.3 శాతం తక్కువగా 1,867 డాలర్లకు చేరింది. వెండి 0.8 శాతం క్షీణతతో ఔన్స్ 24.26 డాలర్ల వద్ద కదులుతోంది. 

నష్టాలతోనే..
ఎంసీఎక్స్‌లో బుధవారం 10 గ్రాముల బంగారం రూ. 438 క్షీణించి రూ. 50,328 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 50,646 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ. 50,053 వద్ద కనిష్టానికి చేరింది. వెండి కేజీ డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ సైతం రూ. 718 నష్టంతో రూ. 62,530 వద్ద స్థిరపడింది. తొలుత రూ. 63,280 వద్ద గరిష్టానికి చేరిన వెండి తదుపరి రూ. 62,023 వరకూ వెనకడుగు వేసింది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా