పసిడి, వెండి ధరల దూకుడు

6 Nov, 2020 10:28 IST|Sakshi

రూ. 51,829 వద్ద కదులుతున్న బంగారం

గురువారం రూ. 52,000 దాటిన 10 గ్రాముల ధర

ఎంసీఎక్స్‌లో రూ. 64,451 వద్ద ట్రేడవుతున్న కేజీ వెండి

న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌ పసిడి 1,940 డాలర్లకు

25.31 డాలర్ల వద్ద ట్రేడవుతున్న ఔన్స్‌ వెండి

2,089- 1,851 డాలర్ల మధ్య పసిడి ఊగిసలాట: నిపుణులు

న్యూయార్క్/ ముంబై: అమెరికా అధ్యక్ష పదవి రేసులో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ ముందంజలో ఉన్న వార్తలతో గురువారం బంగారం, వెండి ధరలు హైజంప్ చేశాయి. వెరసి న్యూయార్క్ కామెక్స్ లో పసిడి ఔన్స్ ఒక దశలో 3 శాతం ఎగసి 1950 డాలర్ల సమీపానికి చేరింది. కోవిడ్-19తో మందగించిన ఆర్థిక వ్యవస్థకు దన్నుగా సహాయక ప్యాకేజీలను అమలు చేయాలంటూ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ తాజాగా అభిప్రాయపడటం కూడా బంగారం ధరలకు ప్రోత్సాహాన్నిచ్చినట్లు నిపుణులు పేర్కొన్నారు. బైడెన్ గెలుపొందితే కనీసం ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీకి ప్రభుత్వం ఆమోదముద్ర వేయవచ్చన్న అంచనాలు ఇందుకు సహకరించినట్లు తెలియజేశారు. గురువారం బంగారం ధరలు 1936 డాలర్లను దాటడం ద్వారా బలాన్ని సంతరించుకున్నట్లు బులియన్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. దీంతో సమీప భవిష్యత్లో 2089- 1851 డాలర్ల మధ్య పసిడి ధరలు హెచ్చుతగ్గులను చవిచూడవచ్చని విశ్లేషించారు.  కాగా.. డాలరు 93 స్థాయికి బలపడటం, ట్రేడర్లు లాభాల స్వీకరణకు దిగడంతో ప్రస్తుతం దేశ, విదేశీ మార్కెట్లో పసిడి ధరలు డీలాపడ్డాయి.  వివరాలు చూద్దాం..

అటూఇటుగా..
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 226 క్షీణించి రూ. 51,829 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. ఇంట్రాడేలో 51,929 వద్ద గరిష్టాన్ని తాకిన పసిడి 51,805 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ రూ. 198 లాభపడి రూ. 64,451 వద్ద కదులుతోంది. తొలుత ఒక దశలో 64,594 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 64,313 వరకూ క్షీణించింది. 

కామెక్స్‌లో..
న్యూయార్క్‌ కామెక్స్‌లో బంగారం ధరలు  ప్రస్తుతం వెనకడుగుతో కదులుతున్నాయి. ఔన్స్‌(31.1 గ్రాములు) పసిడి 0.36 శాతం క్షీణించి 1,940 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్‌ మార్కెట్లోనూ 0.54 శాతం నీరసించి 1,939 డాలర్లకు చేరింది. వెండి మాత్రం 0.5 శాతం పుంజుకుని ఔన్స్ 25.31 డాలర్ల వద్ద కదులుతోంది. 

జంప్ చేశాయ్
ఎంసీఎక్స్‌లో గురువారం 10 గ్రాముల బంగారం రూ. 1,257 జంప్‌చేసి రూ. 52,077 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. ఇంట్రాడేలో పసిడి 52,176 వద్ద గరిష్టాన్ని తాకగా.. 51,161 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ రూ. 2,736 దూసుకెళ్లి రూ. 64,125 వద్ద స్థిరపడింది. తొలుత ఒక దశలో 64,380 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 61,900 వరకూ వెనకడుగు వేసింది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా