పసిడి, వెండి ధరల రికవరీ

13 Aug, 2020 09:24 IST|Sakshi

ప్రస్తుతం10 గ్రాముల పసిడి రూ. 52,365కు

ఎంసీఎక్స్‌లో కేజీ వెండి రూ. 67,165 వద్ద ట్రేడింగ్‌

న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌ పసిడి 1,949 డాలర్లకు

స్పాట్‌ మార్కెట్లోనూ ఔన్స్‌ 1,937 డాలర్ల వద్ద ట్రేడింగ్‌

26 డాలర్ల ఎగువకు ఔన్స్‌ వెండి ధర

బంగారం, వెండి ధరలలో రెండు రోజుల మహాపతనానికి బుధవారం బ్రేక్‌ పడింది. తొలుత డీలాపడినప్పటికీ చివర్లో రికవరీ బాట పట్టాయి. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో బంగారం 10 గ్రాముల ధర రూ. 111 పుంజుకుని రూ. 52,365 వద్ద ప్రారంభమైంది. ఇది అక్టోబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. వెండి కేజీ సెప్టెంబర్‌ ఫ్యూచర్స్‌ రూ. 412 బలపడి రూ. 67,165 వద్ద ట్రేడవుతోంది. ఇటీవల ర్యాలీ బాటలో సాగుతున్న బంగారం, వెండి ధరలు వారాంతం నుంచీ ఆటుపోట్లను చవిచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ బాటలో దేశ, విదేశీ మార్కెట్లలో సోమ, మంగళవారాల్లో భారీగా పడిపోయిన ధరలు బుధవారం మధ్యాహ్నం నుంచీ కోలుకున్నాయి. 

బుధవారమిలా..
బుధవారం ఎంసీఎక్స్‌లో బంగారం 10 గ్రాముల ధర రూ. 325 పుంజుకుని రూ. 52,254 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో రూ. 49,955 వరకూ పతనంకాగా.. రూ. 52,598 వద్ద గరిష్టానికి చేరింది. వెరసి కనిష్టం నుంచి రూ. 2,500 రికవర్‌ అయ్యింది. ఇక వెండి కేజీ నామమాత్రంగా రూ. 181 క్షీణించి రూ. 66,753 వద్ద స్థిరపడింది. అయితే అంతకుముందు ఉదయం సెషన్‌లో రూ. 60,910 వరకూ దిగజారినప్పటికీ చివర్లో భారీగా రికవరైంది. రూ. 68,480 వరకూ ఎగసింది. 

కామెక్స్‌లో ఇలా
ప్రస్తుతం న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌(31.1 గ్రాములు) పసిడి యథాతథంగా 1,949 డాలర్ల వద్ద కదులుతోంది. స్పాట్‌ మార్కెట్లో 21 డాలర్లు జంప్‌చేసి 1,937 డాలర్లను అధిగమించింది. ఇక వెండి ఔన్స్‌ నామమాత్ర లాభంతో 26 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

2013 తదుపరి
మంగళవారం గత ఏడేళ్లలోలేని విధంగా న్యూయార్క్‌ కామెక్స్‌లో బంగారం ఫ్యూచర్స్‌ 4.6 శాతం(93 డాలర్లు) పతనమై 1,946 డాలర్ల వద్ద నిలవగా.. స్పాట్‌ మార్కెట్లో 4.2 శాతం తిరోగమించి 1912 డాలర్ల దిగువన స్థిరపడింది. ఇక వెండి 11 శాతం పడిపోయి 26.04 డాలర్ల వద్ద ముగిసింది. ఇంతక్రితం 2013 ఏప్రిల్‌లో మాత్రమే ధరలు ఈ స్థాయిలో క్షీణించగా.. బుధవారం ట్రేడింగ్‌లోనూ తొలుత ధరలు భారీగా నీరసించిన విషయం విదితమే. పసిడి 1900 డాలర్ల దిగువకు చేరగా.. వెండి 24 డాలర్లను తాకింది. చివర్లో ట్రేడర్లు షార్ట్‌కవరింగ్‌ చేపట్టడంతో ధరలు రికవరీ సాధించినట్లు నిపుణులు తెలియజేశారు.

మరిన్ని వార్తలు