పసిడి- వెండి అక్కడక్కడే..

17 Nov, 2020 10:31 IST|Sakshi

వ్యాక్సిన్‌ వార్తలతో విదేశీ మార్కెట్లో సోమవారం డీలా

ప్రస్తుతం రూ. 50,795 వద్ద ట్రేడవుతున్న బంగారం

ఎంసీఎక్స్‌లో రూ. 63,574 వద్ద కదులుతున్న వెండి

న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌ పసిడి 1,885 డాలర్లకు

24.80 డాలర్ల వద్ద కదులుతున్న ఔన్స్‌ వెండి

న్యూయార్క్/ ముంబై: కోవిడ్‌-19కు వ్యాక్సిన్‌ ద్వారా చెక్‌ పెట్టగలమని తాజాగా మోడర్నా ఇంక్‌ పేర్కొనడంతో పసిడికి డిమాండ్‌ మందగించింది. దీంతో విదేశీ మార్కెట్లో పసిడి ధరలు సోమవారం 1.3 శాతం క్షీణించాయి. దేశీయంగానూ పసిడి, వెండి ధరలు స్వల్పంగా వెనకడుగు వేశాయి. సాధారణంగా సంక్షోభ పరిస్థితులలో పసిడికి డిమాండ్‌ పుట్టే సంగతి తెలిసిందే. యూరోపియన్‌ దేశాలతోపాటు.. యూఎస్‌లోనూ 40 రాష్ట్రాలలో కరోనా వైరస్‌ కేసులు భారీగా పెరగడంతో ప్రపంచ కేంద్ర బ్యాంకులు మరోసారి ప్యాకేజీలకు మొగ్గు చూపుతున్నట్లు నిపుణులు తెలియజేశారు. ఇక మరోవైపు కోవిడ్‌-19కు ధీటుగా ప్యాకేజీని విడుదల చేసేందుకు కాంగ్రెస్‌ను సమాయత్తపరచనున్నట్లు యూఎస్‌ కొత్త ప్రెసిడెంట్‌గా ఎంపికైన జో బైడెన్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా లాక్‌డవున్‌ల విధింపు చేపట్టబోమంటూ యూఎస్‌ ప్రభుత్వం సంకేతాలిచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా పసిడి, వెండి ధరలు అక్కడక్కడే అన్నట్లుగా ట్రేడవుతున్నాయి.

నామమాత్రంగా..
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 35 తక్కువగా రూ. 50,795 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 50,888 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ. 50,738 వద్ద కనిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ సైతం రూ. 117 క్షీణించి రూ. 63,574 వద్ద కదులుతోంది. తొలుత రూ. 63,715 వద్ద గరిష్టానికి చేరిన వెండి తదుపరి రూ. 63,483 వరకూ వెనకడుగు వేసింది. 

ఫ్లాట్‌గా.. 
న్యూయార్క్‌ కామెక్స్‌లో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఫ్లాట్‌గా కదులుతున్నాయి. పసిడి ఔన్స్‌(31.1 గ్రాములు) 0.15 శాతం నష్టంతో1,885 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్‌ మార్కెట్లో దాదాపు యథాతథంగా 1,888 డాలర్లకు చేరింది. వెండి సైతం నామమాత్ర క్షీణతతో ఔన్స్ 24.80 డాలర్ల వద్ద కదులుతోంది. 

నేలచూపుతో
ఎంసీఎక్స్‌లో సోమవారం 10 గ్రాముల బంగారం రూ. 141 క్షీణించి రూ. 50,845 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 51,015 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ. 50,150 వద్ద కనిష్టానికీ చేరింది. ఇక వెండి కేజీ డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ స్వల్పంగా రూ. 191 తగ్గి రూ. 63,610 వద్ద స్థిరపడింది. తొలుత రూ. 64,089 వరకూ ఎగసిన వెండి తదుపరి రూ. 62,160 వరకూ వెనకడుగు వేసింది. 

మరిన్ని వార్తలు