వ్యాక్సిన్‌ దెబ్బకు పసిడి- వెండి డీలా

18 Nov, 2020 10:14 IST|Sakshi

వ్యాక్సిన్‌ వార్తలతో మూడు రోజులుగా వెనకడుగు

ప్రస్తుతం రూ. 50,601 వద్ద ట్రేడవుతున్న బంగారం

ఎంసీఎక్స్‌లో రూ. 62,901 వద్ద కదులుతున్న వెండి

న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌ పసిడి 1,877 డాలర్లకు

24.50 డాలర్ల వద్ద కదులుతున్న ఔన్స్‌ వెండి

న్యూయార్క్/ ముంబై: వరుసగా మూడో రోజు దేశ, విదేశీ మార్కెట్లలో పసిడి, వెండి ధరలు డీలా పడ్డాయి. యూఎస్‌ ఫార్మా దిగ్గజాలు ఫైజర్‌, మోడర్నా ఇంక్‌..  కోవిడ్‌-19కు అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లకు త్వరలో అనుమతులు లభించగలవంటూ ఆశావహంగా స్పందించడంతో పసిడి, వెండి ఫ్యూచర్స్‌లో అమ్మకాలు తలెత్తుతున్నట్లు బులియన్‌ వర్గాలు పేర్కొన్నాయి. క్లినికల్‌ పరీక్షల విశ్లేషణ తదుపరి ఎమర్జెన్సీ ప్రాతిపదికన తమ వ్యాక్సిన్‌కు యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతి లభించగలదన్న అంచనాలను తాజాగా ఫైజర్‌ ఇంక్‌ ప్రకటించింది. ఈ వార్తల నేపథ్యంలో బులియన్‌ ట్రేడర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. చదవండి: (పసిడి- వెండి అక్కడక్కడే..)

నేలచూపులతో..
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 165 తక్కువగా రూ. 50,601 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. ఇంట్రాడేలో రూ. 50,618 వద్ద గరిష్టాన్ని తాకింది. రూ. 50,504 వద్ద కనిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ సైతం రూ. 347 క్షీణించి రూ. 62,901 వద్ద కదులుతోంది. తొలుత రూ. 62,970 వద్ద గరిష్టానికి చేరిన వెండి తదుపరి రూ. 62,808 వరకూ వెనకడుగు వేసింది. 

నీరసంగా.. 
న్యూయార్క్‌ కామెక్స్‌లో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు వెనకడుగుతో కదులుతున్నాయి. పసిడి ఔన్స్‌(31.1 గ్రాములు) 0.45 శాతం నష్టంతో1,877 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్‌ మార్కెట్లో దాదాపు యథాతథంగా 1,879 డాలర్లకు చేరింది. వెండి 0.65 శాతం క్షీణతతో ఔన్స్ 24.50 డాలర్ల వద్ద కదులుతోంది. 

మరిన్ని వార్తలు