కుప్పకూలిన పసిడి- వెండి ధరలు

9 Jan, 2021 09:28 IST|Sakshi

దేశ, విదేశీ మార్కెట్లో పడిపోయిన బంగారం, వెండి ధరలు

10 గ్రాముల బంగారం రూ. 2,086 డౌన్‌- 48,818కు

రూ. 6,112 పతనం- కేజీ వెండి రూ. 63,850కు

న్యూయార్క్‌ కామెక్స్‌లోనూ పసిడి 78 డాలర్లు డౌన్

ఔన్స్‌ బంగారం 4 శాతం క్షీణించి 1,835 డాలర్లకు

వెండి మరింత భారీగా 9.6 శాతం పతనం

ఔన్స్‌ 24.64 డాలర్ల వద్ద ముగిసిన వెండి

న్యూయార్క్/ ముంబై: డెమొక్రటిక్‌ నేత జో బైడెన్‌ యూఎస్‌ కొత్త ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించనున్న నేపథ్యంలో ఒక్కసారిగా బంగారం, వెండి ధరలు కుప్పకూలాయి. ఇందుకు ప్రధానంగా 10ఏళ్ల కాలపరిమితిగల అమెరికన్‌ ట్రెజరీ ఈల్డ్స్‌ 1 శాతానికిపైగా పుంజుకోవడం, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ 90 ఎగువకు బలపడటం వంటి అంశాలు కారణమైనట్లు బులియన్‌ వర్గాలు పేర్కొన్నాయి. వెరసి వారాంతాన దేశ, విదేశీ మార్కెట్లో పల్లాడియంసహా విలువైన లోహాల ధరలు ఉన్నట్టుండి పతనమయ్యాయి. దేశీయంగా ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి రూ. 2,000(4 శాతం) క్షీణించగా.. వెండి కేజీ మరింత అధికంగా రూ. 6,000(9 శాతం)కుపైగా పడిపోయింది. ఇక న్యూయార్క్‌ కామెక్స్‌లోనూ ఔన్స్‌ పసిడి 78 డాలర్లు కోల్పోయింది. వెండి అయితే ఏకంగా 10 శాతం కుప్పకూలింది. ఔన్స్‌ 25 డాలర్ల దిగువకు చేరింది. వివరాలు చూద్దాం.. (పసిడి తగ్గనుందా?.. ఇకపై కొనొచ్చా? )

వ్యాక్సిన్ల ఎఫెక్ట్‌
అమెరికా, బ్రిటన్‌సహా పలు దేశాలు కోవిడ్‌-19 కట్టడికి వీలుగా వ్యాక్సిన్ల వినియోగాన్ని ప్రారంభించాయి. ఫార్మా దిగ్గజాలు ఫైజర్, మోడర్నా, ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్లకు అత్యవసర ప్రాతిపదికన గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంతో ఆర్థిక వ్యవస్థలు తిరిగి గాడిన పడనున్న అంచనాలు బలపడుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దీనికితోడు మార్చి తదుపరి ట్రెజరీ ఈల్డ్స్‌ గరిష్టానికి చేరడంతో పసిడిని హోల్డ్‌ చేసే వ్యయాలు పెరగనున్నట్లు తెలియజేశారు. మరోవైపు 8 నెలల తరువాత డిసెంబర్‌లో వ్యవసాయేతర రంగంలో నిరుద్యోగిత పెరిగినట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. ఫలితంగా కొత్త ప్రభుత్వం భారీ సహాయక ప్యాకేజీలకు ఆమోదముద్ర వేయనున్న అంచనాలు బలపడ్డాయి. కాగా.. సాంకేతిక విశ్లేషణ ప్రకారం సమీప కాలంలో ఔన్స్‌ పసిడి 1705 డాలర్ల వరకూ వెనకడుగు వేయవచ్చని బులియన్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే 1780-1767 డాలర్ల స్థాయిలో సపోర్ట్స్‌ లభించవచ్చని అభిప్రాయపడ్డాయి. (రూ. 51,500- రూ. 70,600 దాటేశాయ్‌ )

పతన బాటలో
ఎంసీఎక్స్‌లో వారాంతాన 10 గ్రాముల బంగారం రూ. 2,086 క్షీణించి రూ. 48,818 వద్ద ముగిసింది. ఇది ఫిబ్రవరి ఫ్యూచర్స్‌ ధర కాగా.. ప్రారంభంలో రూ. 50,799 వద్ద గరిష్టాన్ని తాకిన పసిడి తదుపరి 48,818 వద్ద కనిష్టానికి చేరింది. ఇక వెండి కేజీ మార్చి ఫ్యూచర్స్‌ రూ. 6,112 దిగజారి రూ. 63,850 వద్ద నిలిచింది. రూ. 69,825 వద్ద హుషారుగా ప్రారంభమైన వెండి ఆపై ఒక దశలో రూ. రూ. 63,719 వరకూ తిరోగమించింది. (బంగారు హెడ్‌ఫోన్స్‌ @ రూ. 80 లక్షలు)

కుప్పకూలాయ్‌
న్యూయార్క్‌ కామెక్స్‌లో శుక్రవారం పసిడి ఔన్స్‌ 4.1 శాతం పతనమై 1,835 డాలర్ల వద్ద స్థిరపడింది. స్పాట్‌ మార్కెట్లోనూ 3.5 శాతం నష్టంతో 1,849 డాలర్ల వద్ద నిలిచింది. వెండి మరింత అధికంగా ఔన్స్ దాదాపు 10 శాతం పడిపోయి 24.64 డాలర్ల వద్ద ముగిసింది. పసిడి ఫిబ్రవరి కాంట్రాక్ట్‌కాగా..  వెండి మార్చి ఫ్యూచర్స్‌ ధరలు. 

>
మరిన్ని వార్తలు