కన్సాలిడేషన్‌లో బంగారం, వెండి ధరలు

24 Oct, 2020 10:05 IST|Sakshi

రూ. 50,866 వద్ద ముగిసిన 10 గ్రాముల బంగారం

ఎంసీఎక్స్‌లో రూ. 62,425 వద్ద నిలిచిన కేజీ వెండి

న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌ పసిడి 1905 డాలర్లకు

వారాంతాన 24.68 డాలర్ల వద్ద స్థిరపడిన ఔన్స్‌ వెండి  

వారం మొదట్లో మూడు రోజులపాటు ర్యాలీ చేసిన పసిడి, వెండి ధరలు చివర్లో కన్సాలిడేషన్‌ బాట పట్టాయి. గురువారం లాభాలకు బ్రేక్‌ పడగా.. వాతాంతాన స్వల్ప హెచ్చుతగ్గుల మధ్య అటూఇటుగా ముగిశాయి. యూఎస్‌ ప్రభుత్వ ప్యాకేజీపై నెలకొన్న అనిశ్చితి అటు స్టాక్‌ మార్కెట్లతోపాటు.. ఇటు బంగారం, వెండి తదితర విలువైన లోహాలపైనా ప్రభావం చూపుతున్నట్లు బులియన్‌ వర్గాలు పేర్కొన్నాయి. కోవిడ్‌-19 ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఆర్థిక వ్యవస్థకు దన్నుగా భారీ ప్యాకేజీని ప్రకటించాలన్న అంశంపై డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య విభేధాలు కొనసాగుతున్నాయి. ప్యాకేజీపై ఆర్థిక మంత్రి స్టీవ్‌ ముచిన్‌తో చర్చలు నిర్వహిస్తున్న యూఎస్‌ హౌస్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసీ అధ్యక్ష ఎన్నికలలోగా ఒప్పందం కుదిరే వీలున్నట్లు ఆశావహంగా స్పందించడం గమనార్హం. వారం మొదట్లో పసిడి ధరలు ర్యాలీ బాట పట్టడం ద్వారా 1,940 డాలర్లవైపు పయనించినట్లు బులియన్‌ విశ్లేషకులు పేర్కొన్నారు. అయితే ఆ స్థాయి నుంచి వెనకడుగు వేయడంతో సాంకేతికంగా బలహీనపడ్డాయని తెలియజేశారు. దీంతో సమీప భవిష్యత్‌లో 1,850 డాలర్లవరకూ క్షీణించే వీలున్నట్లు అంచనా వేశారు. అయితే కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు చేపడుతున్న లిక్విడిటీ చర్యలు బంగారానికి జోష్‌నిస్తున్నట్లు తెలియజేశారు. ఫలితంగా ఏదశలోనైనా ట్రెండ్‌ రివర్స్‌కావచ్చని విశ్లేషించారు.

అటూఇటుగా
ఎంసీఎక్స్‌లో శుక్రవారం 10 గ్రాముల బంగారం రూ. 100 పెరిగి రూ. 50,866 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. ఇంట్రాడేలో 51,040 వద్ద గరిష్టాన్నితాకింది. ఇదే విధంగా 50,643 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ రూ. 190 క్షీణించి రూ. 62,425 వద్ద స్థిరపడింది. తొలుత ఒక దశలో 63,006 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 62,063 వరకూ క్షీణించింది. 

కామెక్స్‌లో..
వారాంతాన న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌(31.1 గ్రాములు) పసిడి నామమాత్ర లాభంతో 1,905 డాలర్ల వద్ద నిలిచింది. స్పాట్‌ మార్కెట్లో స్వల్పంగా క్షీణించి 1,902 డాలర్ల వద్ద ముగిసింది. వెండి 0.15 శాతం నీరసించి ఔన్స్ 24.68 డాలర్ల వద్ద స్థిరపడింది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు