బంగారం- వెండి.. మళ్లీ నష్టాలవైపు

8 Sep, 2020 09:56 IST|Sakshi

ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 50,840కు

ఎంసీఎక్స్‌లో కేజీ వెండి రూ. 67,864 వద్ద ట్రేడింగ్‌

న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌ పసిడి 1930 డాలర్లకు

26.91 డాలర్ల వద్ద కదులుతున్న ఔన్స్‌ వెండి

దేశీ ఫ్యూచర్స్‌ మార్కెట్లో సోమవారం.. నాలుగు రోజుల వరుస నష్టాల నుంచి బయటపడిన పసిడి ధరలు.. తాజాగా డీలాపడ్డాయి. అయితే విదేశీ మార్కెట్లో సోమవారం సైతం నేలచూపులతోనే నిలవడానికితోడు.. నేటి ట్రేడింగ్‌లోనూ వెనకడుగుతో కదులుతున్నాయి. వెరసి ప్రస్తుతం అటు న్యూయార్క్‌ కామెక్స్‌లోనూ.. ఇటు దేశీయంగా.. ఎంసీఎక్స్‌లోనూ నష్టాలతో కదులుతున్నాయి. వివరాలు ఇలా..  

నీరసంగా.. 
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 225 నష్టంతో రూ. 50,840 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ రూ. 407 క్షీణించి రూ. 67,864 వద్ద కదులుతోంది.

సోమవారం జోరు
పసిడి ధరల నాలుగు రోజుల వరుస నష్టాలకు సోమవారం చెక్‌ పడింది. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి రూ. 387 ఎగసి రూ. 51,065 వద్ద ముగిసింది. తొలుత 51,200 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 50,680 వద్ద కనిష్టాన్నీ చవిచూసింది. ఇక వెండి కేజీ రూ. 1,005 జంప్‌చేసి రూ. 68,271 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 68,450 వరకూ ఎగసిన వెండి ఒక దశలో రూ. 67,636 వరకూ నీరసించింది. 

వెండి ప్లస్‌..
సోమవారం తొలుత బలపడినప్పటికీ న్యూయార్క్‌ కామెక్స్‌లో బంగారం, వెండి ధరలు చివర్లో నీరసించాయి. తిరిగి నేటి ట్రేడింగ్‌లోనూ బంగారం బలహీనపడగా.. వెండి బలపడింది. ప్రస్తుతం  ఔన్స్‌(31.1 గ్రాములు) పసిడి 0.3 శాతం క్షీణించి 1,930 డాలర్ల దిగువకు చేరింది. స్పాట్‌ మార్కెట్లోనూ 0.5 శాతం నష్టంతో 1924 డాలర్ల వద్ద కదులుతోంది.  వెండి మాత్రం ఔన్స్ 0.7 శాతం పుంజుకుని 26.91 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆగస్ట్‌ నెల మొదట్లో చరిత్రాత్మక గరిష్టాలను సాధించాక.. పసిడి, వెండి ధరలు రెండు రోజులు బలపడితే.. రెండు రోజులు బలహీనపడుతున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు