బంగారం- వెండి.. నేలచూపులు

2 Sep, 2020 10:18 IST|Sakshi

రెండు రోజుల ర్యాలీకి మంగళవారం బ్రేక్‌

ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 51,343కు

ఎంసీఎక్స్‌లో కేజీ వెండి రూ. 67,620 వద్ద ట్రేడింగ్‌

న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌ పసిడి 1971 డాలర్లకు

28.30 డాలర్ల వద్ద కదులుతున్న ఔన్స్‌ వెండి ధర

బంగారం, వెండి ధరలు తాజాగా వెనకడుగు వేస్తున్నాయి. రెండు రోజుల ర్యాలీకి మంగళవారం చివర్లో బ్రేక్‌ పడింది. ఉదయం సెషన్‌లో వరుసగా మూడో రోజు ధరలు పుంజుకున్నప్పటికీ చివర్లో అమ్మకాలు తలెత్తడంతో డీలాపడ్డాయి. వెరసి అటు న్యూయార్క్‌ కామెక్స్‌లోనూ.. ఇటు దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ వెనకడుగుతో ముగిశాయి. అయితే ఎంసీఎక్స్‌లో వెండి లాభాలతో ముగియడం గమనార్హం! ద్రవ్యోల్బణానికంటే ఆర్థిక రికవరీకే ప్రాధాన్యమివ్వనున్నట్లు యూఎస్‌ ఫెడరల్ రిజర్వ్‌ పేర్కొనడంతో వారాంతాన బంగారం, వెండి ధరలు ఆటుపోట్ల నుంచి బయటపడి ర్యాలీ బాట పట్టిన సంగతి తెలిసిందే. 

ప్రస్తుతం..
రెండు రోజుల జోరుకు మంగళవారం బ్రేక్‌ పడగా.. బంగారం, వెండి.. ధరలు మరోసారి డీలా పడ్డాయి. ప్రస్తుతం ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం  రూ. 159 క్షీణించి రూ. 51,343 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. వెండి కేజీ సెప్టెంబర్‌ ఫ్యూచర్స్‌ రూ. 729 నష్టంతో రూ. 67,620 వద్ద కదులుతోంది. 

మంగళవారం మైనస్
వరుసగా రెండు రోజులపాటు బలపడిన పసిడి ధరలు మంగళవారం వెనకడుగు వేశాయి. వెండి మాత్రం మూడో రోజూ దూకుడు చూపింది. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల పసిడి రూ. 199 క్షీణించి రూ. 51,502 వద్ద ముగిసింది. తొలుత 52,100 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 51,303 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ రూ. 1,031 జంప్‌చేసి రూ. 68,349 వద్ద నిలిచింది. ఇంట్రాడేలో 69,351 వరకూ బలపడిన వెండి ఒక దశలో రూ. 68,020 వరకూ వెనకడుగు వేసింది. 

కామెక్స్‌లోనూ..
విదేశీ మార్కెట్లో మంగళవారం వరుసగా మూడో రోజు ఉదయం లాభపడిన పసిడి ధరలు చివర్లో డీలాపడ్డాయి. కాగా.. ప్రస్తుతం మరోసారి వెనకడుగు వేస్తున్నాయి. న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌(31.1 గ్రాములు) బంగారం 0.4 శాతం నీరసించి 1,971 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్‌ మార్కెట్లోనూ 0.3 శాతం బలహీనపడి 1965 డాలర్ల వద్ద కదులుతోంది. ఇక వెండి సైతం ఔన్స్ 1.2 శాతం క్షీణించి 28.30 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఆగస్ట్‌ నెల మొదట్లో చరిత్రాత్మక గరిష్టాలను సాధించాక.. పసిడి, వెండి ధరలు ఒక రోజు బలపడితే.. మరుసటి రోజు నీరసిస్తున్న సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు