పసిడి- వెండి..ర్యాలీకి బ్రేక్‌ 

30 Sep, 2020 10:41 IST|Sakshi

ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 50,510కు

ఎంసీఎక్స్‌లో  1,767 పతనమైన వెండి ఫ్యూచర్స్‌

రూ. 61,299 వద్ద ట్రేడవుతున్న కేజీ వెండి 

న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌ పసిడి 1,896 డాలర్లకు

24 డాలర్ల వద్ద కదులుతున్న ఔన్స్‌ వెండి

దేశ, విదేశీ మార్కెట్లలో రెండు రోజులపాటు జోరు చూపిన పసిడి, వెండి ధరలు మళ్లీ  వెనకడుగు వేస్తున్నాయి. అటు న్యూయార్క్‌ కామెక్స్‌లోనూ, ఇటు దేశీయంగా ఎంసీఎక్స్‌లోనూ నష్టాల బాట పట్టాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై తొలి డిబేట్‌ ప్రారంభమైన నేపథ్యంలో ట్రేడర్లు పసిడి, వెండి ఫ్యూచర్స్‌లో లాభాల స్వీకరణకు తెరతీసినట్లు బులియన్‌ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆర్థిక మంత్రి స్టీవ్‌ ముచిన్‌తో చర్చల తదుపరి ఈ వారంలో సహాయక ప్యాకేజీ డీల్‌ కుదిరే వీలున్నట్లు యూఎస్‌ హౌస్‌ స్పీకర్‌ నాన్సీ పెలోసీ మంగళవారం పేర్కొన్న నేపథ్యంలో వరుసగా రెండో రోజు బంగారం, వెండి ధరలు జంప్‌చేసిన సంగతి తెలిసిందే. ఇతర వివరాలు చూద్దాం..

నష్టాలవైపు
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 171 తగ్గి రూ. 50,510 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్‌ ఫ్యూచర్స్‌  రూ. 1,167 పతనమై రూ. 61,299 వద్ద కదులుతోంది. 

లాభపడ్డాయ్‌
వరుసగా రెండో రోజు మంగళవారం ఎంసీఎక్స్‌లో బంగారం, వెండి ధరలు పుంజుకున్నాయి. 10 గ్రాముల పసిడి రూ. 548 బలపడి రూ. 50,681 వద్ద ముగిసింది. తొలుత 50,739 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 50,059 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. వెండి కేజీ రూ. 2,070 జంప్‌చేసి రూ. 62,166 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో రూ. 62,598 వరకూ పుంజుకున్న వెండి ఒక దశలో రూ. 60,060 వరకూ నీరసించింది.

నేలచూపులో..
న్యూయార్క్‌ కామెక్స్‌లో మంగళవారం సైతం జోరు చూపిన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం డీలా పడ్డాయి. ఫ్యూచర్స్‌లో ఔన్స్‌(31.1 గ్రాములు) పసిడి 0.4 శాతం నష్టంతో 1,896 డాలర్లకు చేరగా.. స్పాట్‌ మార్కెట్లోనూ 0.4 శాతం నీరసించి 1,891 డాలర్ల వద్ద కదులుతోంది. ఇక వెండి ఔన్స్‌  దాదాపు 2 శాతం పతనమై 24 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

మరిన్ని వార్తలు