3 రోజుల లాభాలకు బ్రేక్‌- పసిడి డీలా

4 Nov, 2020 10:49 IST|Sakshi

రూ. 51,373 వద్ద కదులుతున్న 10 గ్రాముల బంగారం

ఎంసీఎక్స్‌లో రూ. 61,708 వద్ద ట్రేడవుతున్న కేజీ వెండి

న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌ పసిడి 1,903 డాలర్లకు

23.97 డాలర్ల వద్ద ట్రేడవుతున్న ఔన్స్‌ వెండి

ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగించనుందన్న అంచనాలతో మూడు రోజులుగా జోరు చూపిన పసిడి, వెండి ధరలు డీలా పడ్డాయి. ఓవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికలు, మరోపక్క ఫెడరల్‌ రిజర్వ్‌ పాలసీ సమీక్ష వంటి అంశాల నేపథ్యంలో ట్రేడర్లు పసిడి, వెండి ఫ్యూచర్స్‌లో లాభాల స్వీకరణకు దిగినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. న్యూయార్క్‌ మార్కెట్లో ఔన్స్‌ పసిడి సాంకేతికంగా కీలకమైన 1900 డాలర్లను అధిగమించడం, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 94 దిగువకు బలపడటం కూడా దీనికి కారణమైనట్లు అభిప్రాయపడ్డారు. కోవిడ్‌-19 దెబ్బకు యూరోపియన్‌ దేశాలలో లాక్‌డవున్‌లు విధించడం, అమెరికాలోనూ కరోనా వైరస్‌ సోకిన కేసులు పెరుగుతుండటం వంటి ప్రతికూలతలతో ఇటీవల పసిడి, వెండి ధరలు ర్యాలీ బాటలో సాగిన విషయం విదితమే. ప్రస్తుత ట్రేడింగ్‌ వివరాలు చూద్దాం..

నష్టాలతో..
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 225 క్షీణించి రూ. 51,373 వద్ద ట్రేడవుతోంది. ఇది డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. ఇంట్రాడేలో 51,465 వద్ద గరిష్టాన్ని తాకిన పసిడి 51,260 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ రూ. 977 కోల్పోయి రూ. 61,708 వద్ద కదులుతోంది. తొలుత ఒక దశలో 61,980 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 61,415 వరకూ క్షీణించింది. 

కామెక్స్‌లో..
న్యూయార్క్‌ కామెక్స్‌లో వరుసగా మూడు రోజులపాటు లాభపడిన బంగారం ధరలు  ప్రస్తుతం వెనకడుగుతో కదులుతున్నాయి. ఔన్స్‌(31.1 గ్రాములు) పసిడి 0.4 శాతం క్షీణించి 1,903 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్‌ మార్కెట్లోనూ 0.5 శాతం నీరసించి 1,899 డాలర్లకు చేరింది. వెండి 1.5 శాతం డీలాపడి ఔన్స్ 23.97 డాలర్ల వద్ద కదులుతోంది. 

లాభపడ్డాయ్‌
వరుసగా మూడో రోజు ఎంసీఎక్స్‌లో మంగళవారం 10 గ్రాముల బంగారం రూ. 553 ఎగసి రూ. 51,620 వద్ద ముగిసింది. ఇది డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. ఇంట్రాడేలో పసిడి 51,630 వద్ద గరిష్టాన్ని తాకగా.. 50,789 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. ఇక వెండి కేజీ డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ రూ. 648 పుంజుకుని రూ. 62,655 వద్ద స్థిరపడింది. తొలుత ఒక దశలో 62,791 వరకూ పుంజుకున్న వెండి తదుపరి రూ. 61,612 వరకూ వెనకడుగు వేసింది.

>
మరిన్ని వార్తలు