పసిడి@ 2 నెలల కనిష్టం

24 Sep, 2020 10:16 IST|Sakshi

2 నెలల గరిష్టానికి డాలరు ఇండెక్స్‌

పసిడి, వెండి ధరలలో కొనసాగుతున్న కరెక్షన్‌

ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 49,335కు

ఎంసీఎక్స్‌లో కేజీ వెండి రూ. 1,850 మైనస్‌

రూ. 57,000 దిగువన ట్రేడవుతున్న వెండి 

న్యూయార్క్‌ కామెక్స్‌లో ఔన్స్‌ పసిడి 1,862 డాలర్లకు

22.35 డాలర్ల వద్ద కదులుతున్న ఔన్స్‌ వెండి

ముందురోజు విదేశీ మార్కెట్లో 2 శాతం పతనంకావడం ద్వారా రెండు నెలల కనిష్టాన్ని తాకిన పసిడి, వెండి ధరలు మరోసారి డీలా పడ్డాయి. ఈ బాటలో దేశీయంగానూ ఎంసీఎక్స్‌లో బుధవారం పతనమైన బంగారం, వెండి ధరలు ప్రస్తుతం నీరసంగా ట్రేడవుతున్నాయి. ప్రభుత్వ సహాయక ప్యాకేజీపై అమెరికన్‌ కాంగ్రెస్‌లో ఏర్పడిన ప్రతిష్టంభన, ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్‌ రెండు నెలల గరిష్టానికి(94.4) బలపడటం వంటి అంశాలు పసిడి, వెండి ధరలను దెబ్బతీస్తున్నట్లు బులియన్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. దీనికితోడు రెండు నెలల క్రితం సరికొత్త గరిష్టాలను తాకిన తదుపరి కన్సాలిడేషన్‌ బాటలో సాగిన బంగారం, వెండి ధరలు ఇటీవల దిద్దుబాటు(కరెక్షన్‌)కు లోనవుతున్నట్లు తెలియజేశారు. వివరాలు చూద్దాం..

1800 డాలర్ల దిగుకు?
ఈ ఏడాది జులై 17న పసిడి ధరలు ఔన్స్‌ 1,795 డాలర్ల వద్ద కనిష్టాన్ని తాకినట్లు బులియన్‌ విశ్లేషకులు తెలియజేశారు. ప్రస్తుతం పసిడి ధరలో కరెక్షన్‌ కారణంగా బేర్‌ ఆపరేటర్లు ఈ స్థాయి వరకూ ధరలను పడగొట్టేందుకు ప్రయత్నించవచ్చని భావిస్తున్నారు. 1800 డాలర్ల దిగువకు ధరలు జారితే.. పసిడి మరింత బలహీనపడేందుకు వీలున్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే కోవిడ్‌-19 మరింత విస్తరిస్తుండటంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీకి విఘాతం కలగవచ్చని.. మళ్లీ లాక్‌డవున్‌ల కాలంవస్తే పలు దేశాల జీడీపీలు మాంద్య పరిస్థితుల్లో చిక్కుకోవచ్చని విశ్లేషిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు బంగారానికి డిమాండ్‌ పెంచగలవని తెలియజేశారు.  

వీక్‌..  వీక్‌..
ఎంసీఎక్స్‌లో ప్రస్తుతం 10 గ్రాముల పసిడి రూ. 173 క్షీణించి రూ. 49,335 వద్ద ట్రేడవుతోంది. ఇది అక్టోబర్‌ ఫ్యూచర్స్‌ ధర కాగా.. వెండి కేజీ డిసెంబర్‌ ఫ్యూచర్స్‌ రూ. 1,850 పతనమై రూ. 56,638 వద్ద కదులుతోంది. ఎంసీఎక్స్‌లో బుధవారం మరోసారి బంగారం, వెండి ధరలు డీలా పడ్డాయి. 10 గ్రాముల పుత్తడి రూ. 873 క్షీణించి రూ. 49,508 వద్ద ముగిసింది. తొలుత 50,380 వద్ద గరిష్టాన్ని తాకగా.. తదుపరి 49,444 వద్ద కనిష్టాన్ని చవిచూసింది. వెండి కేజీ రూ. 2,725 పతనమై రూ. 58,488 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో రూ. 60,487 వరకూ పుంజుకున్న వెండి ఒక దశలో రూ. 58,037 వరకూ నీరసించింది.

2 నెలల కనిష్టం 
న్యూయార్క్‌ కామెక్స్‌లో బుధవారం బంగారం, వెండి  ధరలు డీలా పడ్డాయి. ఫ్యూచర్స్‌లో ఔన్స్‌(31.1 గ్రాములు) పసిడి 1869 డాలర్లకు క్షీణించగా.. స్పాట్‌ మార్కెట్లోనూ 1863 డాలర్లవరకూ పతనమైంది. ఒక దశలో 1856 డాలర్ల వద్ద రెండు నెలల కనిష్టాన్ని తాకింది. ఈ బాటలో వెండి సైతం ఔన్స్‌ 23.11 డాలర్లకు వెనకడుగు వేసింది. కాగా.. ప్రస్తుతం పసిడి 0.4 నీరసించి 1,862 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. స్పాట్‌ మార్కెట్లోనూ 0.4 శాతం బలహీనపడి 1,856 డాలర్లకు చేరింది.  వెండి ఔన్స్ 3.3 శాతం పతనమై 22.35 డాలర్ల వద్ద కదులుతోంది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా