మొత్తం కేసులు 536, బంగారం 312 కిలోలు

21 Feb, 2021 08:45 IST|Sakshi

రెక్కలు కట్టుకుని వస్తోన్న బంగారం

ఐదేళ్లలో 536 అక్రమ బంగారం రవాణా కేసులు 

312 కిలోల అక్రమ బంగారం స్వాధీనం చేసుకున్న 

శంషాబాద్‌ కస్టమ్స్‌ ఈ బంగారం విలువ దాదాపు రూ.96.15 కోట్లకుపైమాటే 

సాక్షి, హైదరాబాద్‌: ‘పలుకే బంగారమ య్యేనా..’‘నీ ఇల్లు బంగారం కానూ..’‘మా ఆయన బంగారం..’ఇలాంటి మాటలను బట్టి చూస్తే తెలియడంలేదూ.. బంగారమంటే ఎవరికైనా ఎంతిష్టమో! ఒంటిపై బంగారు నగలుంటే ఆ దర్జానే వేరు. సామాజిక, ఆర్థిక అంతరాలకు అతీతంగా అంద రూ పసిడిని అమితంగా ఇష్టపడుతుంటారు. మగువల సంగతి సరేసరి. ఈ ఇష్టం ఈనాటిది కాదు. వేల ఏళ్లనాటిది. బంగారానికి ఆదరణ అధికంగా ఉన్నచోట పలు అక్రమాలు వెలుగుచూడటం మరోకోణం. కొందరు సుంకాన్ని ఎగ్గొట్టేందుకు బంగారాన్ని అక్రమరవాణా చేస్తుంటారు. విదేశాల్లో తక్కువకు కొని, మనదేశంలో పన్ను ఎగ్గొట్టి రహస్యంగా తరలిస్తుంటారు. కస్టమ్‌ లేకుండా వచ్చి.. ఇక్కడ చిక్కుతున్నారు. 

పన్ను ఎగ్గొట్టేందుకే..! 
మనరాష్ట్రంలో అంతర్జాతీయ ప్రయాణాలకు సింహద్వారం శంషాబాద్‌ విమానాశ్రయం. కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ రాష్ట్రాల విదేశీయానానికి ఇదే ముఖద్వారం. అందుకే, ఈ విమానాశ్రయం ద్వారా విదేశాల నుంచి అక్రమంగా బంగారం తీసుకొచ్చేవారు తరచూ కస్టమ్స్‌ అధికారులకు చిక్కుతుంటారు. వాస్తవానికి వీరు అక్కడ బంగారాన్ని కొనుక్కునే వస్తారు. దానికి కస్టమ్స్‌ డ్యూటీ చెల్లిస్తే ఏ సమస్యా ఉండదు. కానీ, చాలామంది కస్టమ్స్‌ డ్యూటీ చెల్లించేందుకు ఇష్టపడక.. పలు అడ్డదారులను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన ఆధునిక టెక్నాలజీ, నిఘావ్యవస్థలు అక్రమ బంగారం రవాణాను ఇట్టే పట్టేస్తున్నాయి.  

కిలో వరకు చాన్స్‌ 
వాస్తవానికి విదేశాలకు వివిధ వేడుకలు, విహారయాత్రలు, వ్యాపారాల పనిమీద వెళ్లేవారికి ఒక కిలో వరకు బంగారం కొనుగోలు చేసి తీసుకువచ్చేందుకు నిబంధనలు అనుమతిస్తాయి. ఈ సదుపాయం కేవలం భారత పౌరులకు మాత్రమే. వీరు తీసుకువచ్చిన కిలో బంగారం మొత్తం విలువలో 38.5 శాతం కస్టమ్స్‌ డ్యూటీ చెల్లించి తీసుకువెళ్లవచ్చు. ఒకవేళ సంవత్సరంపాటు భారతీయులు విదేశాల్లో ఉండి ఇండియాకు వచ్చినట్లయితే వారు తీసుకువచ్చిన మొత్తం బంగారం విలువలో 13.5 శాతం కస్టమ్స్‌ డ్యూటీ చెల్లించాల్సి ఉంటుంది.  

అక్రమమార్గంలో ఎంతంటే.? 
గత ఐదేళ్లలో కస్టమ్స్‌ అధికారులు శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎంత బంగారాన్ని పట్టుకున్నారన్న విషయం తెలుసుకునేందుకు నగరానికి చెందిన రాబిన్‌ అనే సామాజిక కార్యకర్త సమాచార హక్కు కింద దరఖాస్తు చేసుకున్నారు. 2015 నుంచి 2020 డిసెంబర్‌ వరకు 536 కేసులు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనల్లో మొత్తం రూ.96.15 కోట్ల విలువైన 312.87 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని వివరించారు. 

ఈ దేశాల నుంచే అధికంగా.. 
విదేశాల నుంచి శంషాబాద్‌కు వచ్చే బంగారంలో అధికశాతం గల్ఫ్‌ దేశాలదే. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ), ఖతార్, సౌదీ అరేబియా, జెడ్డా, మలేసియా, బెహ్రా యిన్, థాయ్‌లాండ్, సింగపూర్‌ దేశాల నుంచి వస్తున్న ప్రయాణికుల వద్దే పైన పేర్కొన్న బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని కస్టమ్స్‌ అధికారులు ప్రకటించారు. ఆయా దేశాల్లో బంగారం విక్రయాలపై పెద్దగా ఆంక్షలు లేవు. అందుకే, చాలామంది బంగారం కొనేసి విమానమెక్కుతారు.

తీరా ఇండియాకు వచ్చేసరికి విధించే 38.5 శాతం కస్టమ్స్‌ ట్యాక్స్‌ చూసి కళ్లు తేలేస్తుంటారు. కానీ, బంగారం విక్రయాల్లో ఆరితేరిన వారు అక్రమమార్గాల్లో తీసుకువస్తుంటారు. ఈ రెండు మార్గాల్లో కాకుండా విదేశాల్లో స్థిరపడి ఏడాదికి ఒకసారి వచ్చేవారిని కొందరు ఆశ్రయిస్తారు. ఇక్కడ నుంచి డబ్బులు పంపి బంగారం కొనిపించి మరీ తెప్పిస్తారు. 13.5 శాతం ట్యాక్స్‌ కూడా వీరే కడతారు. ఇలా బంగారం తెచ్చిచ్చినందుకు వారికి టికెట్‌ ఖర్చులో, ఇతర బహుమానాలో ఇస్తుంటారు.   

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు