ఆ ఉద్యోగుల గుండెల్లో గుబులే: అతిపెద్ద కోతలకు తెర!

13 Sep, 2022 13:23 IST|Sakshi

న్యూఢిల్లీ:గ్లోబల్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం గోల్డ్‌మన్ సాచ్స్ గ్రూప్ భారీ తొలగింపులకు తెరతీసింది. మహమ్మారి ప్రారంభమై నప్పటినుండి   పెద్ద సంఖ్యలో ఉద్యోగులను   ఇంటికి పంపించనుంది. వాల్ స్ట్రీట్ టైటన్ ఈ నెల (సెప్టెంబరు) నుండి అనేక వందల మందిని తొలగించాలని యోచిస్తోందట. కోవిడ్‌ తరువాత ఇది భారీ తొలగింపు అని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి. గోల్డ్‌మన్ ఉద్యోగ కోతలకు సిద్ధమవుతున్నట్లు న్యూయార్క్ టైమ్స్ సోమవారం నివేదించింది. అయితే దీనిపై వ్యాఖ్యానించేందుకు  గోల్డ్‌మన్ ప్రతినిధి నిరాకరించారు.

మొత్తం సంఖ్య కొన్ని మునుపటి కంటే తక్కువే అయినప్పటికీ,  ఈ సెప్టెంబరు నుంచి వందల సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేయనుంది. కోవిడ్‌ సంక్షోభం తరువాత ఇదే అతిపెద్ద కోత అని అంచనా. ఆదాయాలు భారీగా తగ్గిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బ్లూమ్‌బెర్గ్ డేటా ప్రకారం, ఈ సంవత్సరం బ్యాంక్ ఆదాయాలు 40శాతానికి మించి పడిపోనున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జూలైలో నియామకాలని తగ్గించడంతోపాటు, ఉద్యోగుల వార్షిక పనితీరు సమీక్షించాలని సంస్థ నిర్ణయించింది. 

సమీక్ష అనంతరం సాధారణంగా ఫెర్‌ఫామెన్స్‌ చెత్తగా ఉన్న సిబ్బందిని తొలగించనుంది. అలాగే అట్రిషన్ కారణంగా కోల్పోయిన సిబ్బందిని భర్తీ చేసే ప్రక్రియను కూడా తగ్గిస్తున్నట్టు సంస్థ సీఎఫ్‌వో డెనిస్ కోల్‌మన్ ఒక సందర్బంలో వెల్లడించారు. కంపెనీ రెండో త్రైమాసికం ముగింపు నాటికి సంస్థలో 47వేల  ఉద్యోగులుండగా, రెండేళ్ల  క్రితం 39,100 ఉద్యోగులు ఉన్నారు. అలాగే గత 12 నెలలుగా ఎస్‌అండ్‌పీ 500 ఫైనాన్షియల్స్ ఇండెక్స్ 7.5 శాతం క్షీణతతో పోలిస్తే గోల్డ్‌మ్యాన్ షేర్లు ఈ ఏడాది 10 శాతానికిపైగా పతనం కాగా గత  ఏడాది క్రితం కంటే దాదాపు 15 శాతం క్షీణించాయి.

మరిన్ని వార్తలు