GVK Biosciences: గోల్డ్‌మన్‌ శాక్స్‌తో రూ. 7,300 కోట్ల డీల్‌!

19 May, 2021 08:40 IST|Sakshi

ముంబై: కాంట్రాక్ట్‌ రీసర్చ్, డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ అయిన జీవీకే బయోసైన్సెస్‌లో గోల్డ్‌మన్‌ శాక్స్‌కు చెందిన ప్రైవేట్‌ ఈక్విటీ కంపెనీ 33 శాతం వాటా చేజిక్కించుకుంటోంది. క్రిస్‌క్యాపిటల్‌ తనకున్న 17 శాతం వాటా, ప్రమోటర్లు 16 శాతం వాటాను విక్రయిస్తున్నట్టు సమాచారం. ఈ డీల్‌ ద్వారా జీవీకే బయోను రూ.7,300 కోట్లుగా విలువ కట్టారు. ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ కంపెనీ జెఫరీస్‌ అడ్వైజర్‌గా వ్యవహరిస్తోంది.

ఇక కొద్ది రోజుల్లో ఈ డీల్‌ విషయమై అధికారిక ప్రకటన వెలువడనుంది. డీల్‌ పూర్తి అయితే గోల్డ్‌మన్‌ శాక్స్‌కు భారత ఫార్మా రంగంలో గడిచిన ఆరు నెలల్లో ఇది రెండవ పెట్టుబడి అవుతుంది. గోల్డ్‌మన్‌ శాక్స్‌ 2020 నవంబరులో బయోకాన్‌కు చెందిన బయోకాన్‌ బయాలాజిక్స్‌లో సుమారు రూ.1,100 కోట్లు పెట్టుబడి చేసింది. జీవీకే బయోసైన్సెస్‌లో జీవీకే కుటుంబానికి, డీఎస్‌ బ్రార్‌ కుటుంబానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా చెరి 41 శాతం వాటా ఉంది. 

ఇదీ జీవీకే బయో నేపథ్యం.. 
జీవీకే బయోను జీవీకే గ్రూప్, ర్యాన్‌బాక్సీ ల్యాబొరేటరీస్‌ మాజీ సీఈవో అయిన డీఎస్‌ బ్రార్‌ ప్రమోట్‌ చేస్తున్నారు. ప్రమోటర్, చైర్మన్‌గా 2004లో జీవీకే బయో బోర్డులో బ్రార్‌ చేరారు. 2001లో ప్రారంభమైన ఈ సంస్థలో 2,500 పైచిలుకు శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు. ఔషధ ఆవిష్కరణ, రసాయన, జీవ శాస్త్రం, మాలిక్యూల్‌ పరిశోధన, అభివృద్ధి, రసాయనాల అభివృద్ధి, ఫార్ములేషన్, ఒప్పంద తయారీ విభాగాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది.

450కిపైగా క్లయింట్లు ఉన్నారు. 2019–20లో రూ.950 కోట్ల ఆదాయం ఆర్జించింది. ఎబిటా రూ.275 కోట్లుగా ఉంది. ఔషధ ఆవిష్కరణ, పరిశోధనపైనే సగం ఆదాయం సమకూరుతోంది. మిగిలినది కాంట్రాక్ట్‌ తయారీ విభాగం నుంచి వస్తోంది. 2014లో యూఎస్‌కు చెందిన ప్రీ–క్లినికల్‌ కాంట్రాక్ట్‌ రీసర్చ్‌ రంగంలో ఉన్న ఆరాజెన్‌ బయోసైన్సెస్‌ను కొనుగోలు చేసింది.

చదవండి: Vodafone Idea: ఆ కస్టమర్లకు రూ.49 ప్యాక్‌ ఉచితం

మరిన్ని వార్తలు