వచ్చే ఏడాదిలోగా 2300డాలర్లకు బంగారం: గోల్డ్‌మెన్‌ శాక్స్‌

29 Jul, 2020 12:44 IST|Sakshi

అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ బంగారం ధర వచ్చే ఏడాదికల్లా 2300డాలర్లకు చేరుకుంటుందని గోల్డ్‌మెన్‌ శాక్స్‌ సంస్థ అభిప్రాయపడింది. రానున్న రోజుల్లో అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక వడ్డీరేట్లను మరింత డౌన్‌గ్రేడ్‌ చేయవచ్చనే అంచనాలతో పాటు భౌగోళికంగా నెలకొన్న అనిశ్చితి పరిస్థితులు బంగారం తదుపరి ర్యాలీకి తోడ్పడతాయని బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. ఈ ఏడాదిలో అంతర్జాతీయంగా బంగారం ధర 27శాతం ర్యాలీ చేసిన సంగతి తెలిసిందే. 

‘‘ఇటీవల అర్థిక వ్యవస్థ రికవరీకి సమాంతరంగా ద్రవ్యోల్బణ ఆందోళనలు పెరుగుతున్నాయి. డాలర్‌ నిర్మాణాత్మకంగా బలహీనపడుతోంది. మరోవైపు బంగారం ఈటీఎఫ్‌లోకి హెడ్జింగ్‌ ఇన్‌ఫ్లోలు పెరుగుతున్నాయి. ఈ తరుణంలో ఫండ్‌ మేనేజర్లు డాలర్‌కు హెడ్జ్‌గా బంగారం వినియోగానికి మొగ్గుచూపవచ్చు’’ అని గోల్డ్‌మెన్‌ శాక్స్‌ తెలిపింది.  

ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటిని పెంచేందుకు అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్లను మరింత డౌన్‌గ్రేడ్‌ చేయవచ్చు. అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు పెరగడం, కరోనా కేసులు తగ్గుముఖపట్టకపోవడం తదితర కారణాలు బంగారానికి కలిసొచ్చే అంశంగా ఉన్నాయని గోల్డ్‌మెన్‌ శాక్స్‌ అభిప్రాయపడింది. 

గోల్డ్‌మెన్‌ శాక్స్‌ వెండి ధర అవుట్‌లుక్‌ను కూడా పెంచింది. వచ్చే ఏడాదిలోగా ట్రాయ్‌ ఔన్స్‌ వెండి ధర 30డాలర్లకు చేరుకుంటుందని తెలిపింది. బంగారం ధర పెరుగుదలతో పాటు సోలార్‌ ఎనర్జీ పరిశ్రమలో వెండి వినియోగం పెరుగుతుందనే అంచనాలు వెండి ధరను పరుగులు పెట్టిస్తాయని గోల్డ్‌మెన్‌ శాక్స్‌ తెలిపింది. 

మరిన్ని వార్తలు