Goldman Sachs: 2021–22లో భారత్‌ జీడీపీ వృద్ధి 9.8%

24 Nov, 2021 08:22 IST|Sakshi

గోల్డ్‌మన్‌ శాక్స్‌ అంచనా  

2022–23లో 9.8 శాతంగా విశ్లేషణ

2022లో రెపో 0.75 శాతం పెరిగే అవకాశం   

ముంబై: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2021–22లో 8.5 శాతంగా నమోదవుతుందని అమెరికన్‌ బ్రోకరేజ్‌ దిగ్గజం– గోల్డ్‌మన్‌ శాక్స్‌ తన తాజా నివేదికలో అంచనావేసింది. 2022–23లో వృద్ధి రేటు 9.8 శాతంగా ఉంటుందని పేర్కొంది. మహమ్మారి ప్రతికూల ప్రభావంతో గడచిన ఆర్థిక సంవత్సరం దేశ ఆర్థిక వ్యవస్థ 7.3 శాతం క్షీణించిన సంగతి తెలిసిందే. ఈ లో బేస్‌ ఎఫెక్ట్‌తో 2021–22లో మంచి వృద్ది రేటు నమోదవుతుందన్న అంచనాలు ఉన్నాయి. 2021–22లో 9.5 శాతం వృద్ధి రేటు నమోదవుతుందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అంచనా. అయితే 2022–23లో మాత్రం ఈ వృద్ధి రేటు 7.8 శాతం ఉంటుందని ఆర్‌బీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలో గోల్డ్‌మన్‌ శాక్స్‌ తాజా నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే... 

► మహమ్మారి ప్రభావంగ గణనీయంగా తగ్గుముఖం పట్టింది.  వ్యాక్సినేషన్‌ కార్యక్రమం విస్తృత ప్రాతిపదికన జరుగుతోంది. ఆయా అంశాలకు తోడు వినియోగం మెరుగుపడుతోంది. ఈ సానుకూల పరిస్థితులు దేశ ఆర్థిక పురోగతికి దోహదపడే అంశాలు.  

► ప్రభుత్వ మూలధన వ్యయాలు కూడా భారీగా పెరుగుతాయని విశ్వసిస్తున్నాం. అయితే ప్రైవేటు కార్పొరేట్‌ క్యాపిటల్‌ వ్యయాలు (క్యాపెక్స్‌) రికవరీ, హౌసింగ్‌ పెట్టుబడుల పునరుద్దరణ మాత్రం బలహీనంగానే ఉంది.  

► బేస్‌ ఇయర్‌ ఎఫెక్ట్‌ తగ్గిపోయినప్పటికీ, ఆర్థిక వ్యవస్థలో పలు సానుకూల అంశాల వల్ల 2022–23 ఆర్థిక సంవత్సరంలో కూడా భారీగా 9.8 శాతం వృద్ధి నమోదవుతుందన్నది అంచనా.  

► వృద్ధి పురోగమిస్తుందన్న సంకేతాలతో ఆర్‌బీఐ తన ద్రవ్య పరపతి విధానాన్ని తిరిగి  సాధారణ పరిస్థితికి తీసుకురావడానికి తగిన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. 2022లోనే ఆర్‌బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4 శాతం)ను 0.75 శాతం పెంచే అవకాశాలు ఉన్నాయి.  

► నాలుగు దశల్లో పాలసీ విధానాన్ని సాధారణ పరిస్థితికి తెచ్చే అవకాశం ఉంది. అదనపు లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)ని వెనక్కు తీసుకుంటామని ఇప్పటికే ఆర్‌బీఐ పేర్కొనడం ఇందులో మొదటి దశగా భావించవచ్చు.  

► వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం 2021లో సగటున 5.2 శాతం, 2022లో 5.8 శాతంగా ఉండే వీలుంది. 

బార్‌క్లేస్‌ అంచనా 10 శాతం 
ఇదిలాఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 10 శాతం వృద్ధి రేటు నమోదవుతుందని బ్రిటిష్‌ బ్రోకరేజ్‌ సంస్థ బార్‌క్లేస్‌ అంచనావేసింది. అయితే 2022–23లో వృద్ధి 7.8 శాతానికి పరిమితమవుతుందని విశ్లేషించింది. ఆర్‌బీఐ సరళతర వడ్డీరేట్ల విధానానికి ముగింపు పలకవచ్చని కూడా బార్‌క్లేస్‌ అంచనావేసింది. డిసెంబర్‌లో జరిగే పాలసీ సమీక్షలో రివర్స్‌ రెపో రేటును పెంచే వీలుందని విశ్లేషించింది. అటు తర్వాత 2022లో రెపో రేటును కూడా పెంచే అవకాశం ఉందని పేర్కొంది. భారతీయ విధాన నిర్ణేతలు గత మూడు సంవత్సరాలుగా వృద్ధికి, ఆర్థిక మూల స్తంభాలకు విఘాతం కలగకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించారని పేర్కొంది. నిజానికి భారత్‌ ఆర్థిక వ్యవస్థ మహమ్మారి ప్రారంభానికి ముందే నెమ్మదించడం ప్రారంభించిందని ఈ సందర్భంగా పేర్కొంది. ఇప్పుడు ఆర్థిక స్థిరత్వంపై విధాన నిర్ణేతలు ప్రధానంగా దృష్టి సారిస్తున్నారని
వివరించింది.

చదవండి: భారత్‌ జీడీపీ వృద్ధి 8.1 శాతం - ఎస్‌బీఐ రీసెర్చ్‌ రిపోర్ట్‌

మరిన్ని వార్తలు