2022లో 6.9 శాతం.. 2023లో 5.9 శాతం!

24 Nov, 2022 06:24 IST|Sakshi

భారత్‌ వృద్ధిపై గోల్డ్‌మన్‌ శాక్స్‌ అంచనా

2023 డిసెంబర్‌ నాటికి నిఫ్టీ 20,500కి చేరుతుందని అంచనా  

ముంబై: భారత ఆర్థిక వ్యవస్థ 2022, 2023లో వరుసగా 6.9 శాతం, 5.9 శాతం వృద్ధిని సాధిస్తుందని వాల్‌ స్ట్రీట్‌ బ్రోకరేజ్‌ సంస్థ గోల్డ్‌మన్‌ శాక్స్‌  ఒక నివేదికలో అంచనా వేసింది. 2022 భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను రేటింగ్‌ ఏజెన్సీ ఇటీవలే 7.7 శాతం నుంచి 7 శాతానికి తగ్గించిన నేపథ్యంలో గోల్డ్‌మన్‌ శాక్స్‌ ఈ నివేదికను విడుదల చేసింది. ముఖ్యాంశాలు చూస్తే...
► వరుసగా రెండు సంవత్సరాల భారీ ర్యాలీ కొనసాగే వీలుంది. డిసెంబర్‌ 2023 నాటికి బెంచ్‌మార్క్‌ నిఫ్టీ 20,500 స్థాయికి చేరుకుంటుందని అంచనా. ఇది 12 శాతం ధర రాబడిని సూచిస్తుంది.  
► ఇక వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్‌ ద్ర­వ్యోల్బణం విషయానికి వస్తే, 2022లో సగటు­ను 6.8 శాతం, 2023లో 6.1 శాతంగా ఉండే వీలుంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)కి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం లక్ష్యం కన్నా ఇది అప్పటికీ ఎక్కువగానే ఉండడం గమనార్హం.  

► వచ్చే డిసెంబర్‌ పాలసీ సమీక్షలో ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ బ్యాంకులకు సెంట్రల్‌ బ్యాంక్‌ ఇచ్చే రుణ రేటు రెపోను 50 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) పెంచే వీలుంది. 2023 ఫిబ్రవరిలో మరో 35 బేసిస్‌ పాయింట్లు పెరిగే వీలుంది. ఈ చర్యలతో రెపో రేటు 6.75 శాతానికి చేరుతుంది.  మే తర్వాత సెంట్రల్‌ బ్యాంక్‌ ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంగా రెపో రేటును నాలుగు దఫాలుగా 4 నుంచి 5.9 శాతానికి పెంచింది.  తదుపరి ద్వైమాసిక సమావేశం డిసెంబర్‌ 5 నుంచి 7వ తేదీ మధ్య జరగనుంది.

మరిన్ని వార్తలు