ఆ గృహ కొనుగోలుదారులకు శుభవార్త! 3 నెలల్లో ఫ్లాట్‌లు

23 Sep, 2022 21:04 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఆమ్రపాలి గ్రూప్‌కు చెందిన గృహ కొనుగోలుదారులకు శుభవార్త. 2 నుంచి 3 నెలల్లో 11,858 ఫ్లాట్‌లను డెలివరీ చేస్తామని కోర్టు రిసీవర్ సీనియర్ న్యాయవాది ఆర్ వెంకటరమణి సుప్రీం ధర్మాసనానికి శుక్రవారం తెలియజేశారు. నిర్మించాల్సిన 38,000 ఫ్లాట్లలో 11,000 యూనిట్లకు పైగా ఫ్లాట్ కొనుగోలుదారులకు అప్పగిస్తున్నారని ఇది చాలా కీలక పరిణామమని తెలిపారు.

వచ్చే నెలలో వచ్చే పండుగ సీజన్‌లో ఎన్‌బీసీసీ పూర్తి చేసిన 5,428 ఫ్లాట్లను గృహ కొనుగోలు దారులకు ఇవ్వనున్నట్లు, సుప్రీంకు  సీనియర్‌ న్యాయవాది తెలిపారు. విద్యుత్ నీటి కనెక్షన్‌తో గృహ కొనుగోలుదారులకు ఇవ్వనున్నట్లు కోర్టు రిసీవర్ వెంకటరమణి ప్రధాన న్యాయమూర్తి యుయు లలిత్, జస్టిస్ బేల ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనానికి నివేదించారు. ఈ పూర్తయిన ఫ్లాట్లన్నీ గృహ కొనుగోలుదారుల నుండి పూర్తి చెల్లింపు తర్వాత మాత్రమే అప్పగిస్తామనివెంకటరమణి స్పష్టం చేశారు. అలాగే ఫోరెన్సిక్ ఆడిటర్లు రూ. 3870.38 కోట్లను గృహ కొనుగోలుదారుల నుండి గ్రహించాల్సిన మొత్తంగా అందించారని, అయితే క్రాస్-చెకింగ్‌లో ఈ మొత్తం 3,014 కోట్లుగా గుర్తించామన్నారు.

రూ. 3,014 కోట్లలో ఇప్పటి వరకు 22,701 మంది గృహ కొనుగోలుదారుల నుంచి రూ. 1,275 కోట్లు పొందామని, మిగిలిన మొత్తాన్ని 7939 మంది గృహ కొనుగోలుదారుల నుంచి స్వీకరించాల్సి ఉందని, ఈ విషయంలో షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. చెల్లింపు ప్లాన్ ప్రకారం అక్టోబర్ 2024 నాటికి పూర్తికావాల్సిఉందని వెంకటరమణి తెలిపారు. 
 

మరిన్ని వార్తలు