సూపర్‌ కార్‌ లవర్స్‌కు గుడ్‌న్యూస్‌

21 Apr, 2021 19:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విలాసవంతమైన లగ్జరీ కార్ల ప్రేమికులకు శుభవార‍్త . ఇప్పుడు తమ అభిమాన లగ్జరీ కారును అద్దెకు తీసుఉని ఎంచక్కా నగరంలో చక్కర్లు కొట్టొచ్చు.  హైదరాబాద్ రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో ఈ బంపర్‌ ఆఫర్‌ అందుబాటులోకి  వస్తోంది.  సూపర్ కార్ ప్రియులకు ఈ ప్రత్యేకమైన సేవను అందించే మొదటి విమానాశ్రయంగా హైదరాబాద్‌లోని విమానాశ్రయం అవతరించింది.  దీంతో లంబోర్ఘిని గల్లార్డో, జాగ్వార్ ఎఫ్ టైప్, పోర్స్చే 911 కారెరా, ఫోర్డ్ ముస్టాంగ్, లెక్సస్ ఇఎస్ 300 హెచ్, ఆడి ఎ 3 క్యాబ్రియోలెట్, బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్, మెర్సిడెస్ బెంజ్ ఇ 250, మసెరటి గిబ్లి, బిఎమ్‌డబ్ల్యూ 3 జిటి , వోల్వో ఎస్ 60 వంటి కార్లను ఎంచుకోవచ్చు. దీంతోపాటు టయోటా ఫార్చ్యూనర్ లేదా మారుతి సుజుకి సియాజ్‌ను కూడా లభ్యం.

విమానాశ్రయంనుంచి నగరంలోని ఇతర ప్రదేశాలకు వెళ్లాలంటే ఇప్పటికే వరకు క్యాబ్‌లను ఆశ్రయించాల్సి వచ్చేది.  కానీ ఇపుడు  హైదరాబాద్‌కు వచ్చే ప్రయాణీకులందరూ విమానాశ్రయానికి చేరుకున్న తరువాత స్థానిక నగర ప్రయాణానికి అద్దె ప్రాతిపదికన లగ్జరీ కారును బుక్ చేసుకోవచ్చు. ఒక డ్రైవర్‌తో లేదా లేకుండా కూడా ఈ ఆఫర్‌ లభ్యం. అంటే  సూపర్ కార్ల డ్రైవింగ్‌ అనుభవాన్ని కూడా పొందవచ్చన్నమాట. కార్టోక్ ఇచ్చిన నివేదిక ప్రకారం, మీ ఫ్లైట్ హైదరాబాద్‌లోకి రాకముందే మీరు మీకు నచ్చిన కారును ఆన్‌లైన్‌లో లేదా ఫోన్ కాల్ ద్వారా సులభంగా బుక్ చేసుకోవచ్చు. కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా ఉండటానికి అన్ని కార్లు పూర్తిగా శానిటైజ్‌ చేస్తున్నట్టు  పేర్కొంది. కారు  లేదా బైక్ అద్దె మోడల్ దేశవ్యాప్తంగా ట్రెండిగ్‌లో ఉంది. మనాలి లేదా గోవా వంటి పర్యాటక ప్రాంతాల్లో రోజుకు కేవలం రూ .1000 చొప్పున బైక్‌లు / స్కూటర్లను సులభంగా బుక్ చేసుకోవచ్చు  అలాగే డ్రైవర్‌ లేకుండా సుమారు 5000 రూపాయలు చెల్లించి కారును అద్దెకు తీసుకోనే అవకాశం పలు పర్యాటక నగరాల్లో లభిస్తోంది. మరి హైదరాబాద్‌లో ఎంత చార్జ్‌ చేయబోతున్నారనే దానిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరిన్ని వార్తలు