అటల్‌ పెన్షన్‌ యోజనకు విశేష ఆదరణ

31 Jan, 2023 04:17 IST|Sakshi

న్యూఢిల్లీ: సామాజిక భద్రతా పథకం–  అటల్‌ పెన్షన్‌ యోజన (ఏపీవై)కు విశేష ఆధరణ లభిస్తున్నట్లు పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) పేర్కొంది. ఈ పథకం కింద ఇప్పటికి 5 కోట్ల మందికిపైగా ప్రజలు నమోదయినట్లు తెలిపింది. ఒక్క 2022 క్యాలెండర్‌ ఇయర్‌లో 1.25 కోట్ల మంది చందాదారులుగా చేరినట్లు వివరించింది. 2021లో ఈ సంఖ్య 92 లక్షలు కావడం గమనార్హం.

2021 స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ఏపీవైని ప్రకటించారు. దీని విస్తృతికి పీఎఫ్‌ఆర్‌డీఏ అనేక కార్యక్రమాలు చేపట్టింది. ఈ పథకం కింద ఒక చందాదారుడు (చేరిన వయస్సు, చందాపై ఆధారపడి) 60 సంవత్సరాల వయస్సు నుండి నెలకు రూ. 1,000 నుండి రూ. 5,000 వరకు కనీస హామీ పెన్షన్‌ను అందుకుంటాడు.  చందాదారుని మరణానంతరం అదే పెన్షన్‌ చందాదారుని జీవిత భాగస్వామికి చెల్లించడం జరుగుతుంది. చందాదారుడు, జీవిత భాగస్వామి ఇద్దరూ మరణించినప్పుడు, చందాదారుడు 60 ఏళ్ల వరకు చెల్లించిన మొత్తం నామినీ పొందే వెసులుబాటు ఉంది.  

మరిన్ని వార్తలు